ఇంకోసారి ఎంపీగా అవకాశం ఇవ్వండి : కవిత

ఇంకోసారి ఎంపీగా అవకాశం ఇవ్వండి : కవిత

ఈసారి నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నిక రసవత్తరంగా సాగనుంది.  ఈ స్థానం నుండి కవితతో పాటు అనేకమంది రైతులు కూడా పోటీచేస్తున్నారు.  దీంతో కవిత విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.  తాజాగా జక్రాన్ పల్లి ప్రచారంలో పాల్గొన్న ఆమె 'రెండో సారి కేసీఆర్ ను సీఎం చేసినందుకు మీకు ఏమిచ్చి రుణం తీసుకోవాలో తెలియట్లేదు.  ఏ పథకం పెట్టినా ఎంతో ఆలోచించి ప్రవేశ పెడుతున్నాం.  పీఎఫ్ కార్డు ఉన్న బీడీ కార్మికులు ప్రతి ఒక్కరికి మే నుంచి రూ.2 ఫించన్లు వస్తాయి.  గతంలో కిస్తీలు ఇవ్వక పోతే ఇళ్ళు దర్వాజలు పిక్కపోయేవారు.  కానీ టీఆరెస్ ప్రభుత్వం ప్రతి పైసా ఇల్లు కట్టుకునేందుకు ఇస్తోంది.  వచ్చే రెండేళ్లలో ప్రతి గ్రామంలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం  చేపడతాం' అన్నారు. 

ద్వాక్రా గ్రూపులను ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను తయారు చేయిస్తాం అన్న ఆమె 'ఎయిర్ పోర్ట్ కోసం 800 ఎకరాల భూమి చూశాం.  జక్రాన్ పల్లిలో రానున్న రోజుల్లో ఎయిపోర్టు వస్తుంది.  ఐటి హబ్ పనులు నిజామాబాద్ లో వేగంగా  జరుగుతున్నాయి.  రానున్న తరం కోసం పనిచేస్తున్నాం.  పాసు బుక్కులు రాని కొన్ని గ్రామాలున్నాయి.  త్వరలోనే పాస్ బుక్ లు అందరికీ వస్తాయి.  ఏం ఆధారం లేని ప్రజల కోసం వంద శాతం సబ్సిడీ కింద రూ.50 వేలు రుణాలు ఇచ్చాం.  మళ్ళీ ఎంపీగా నాకు అవకాశం ఇస్తే శక్తి వంచన లేకుండా పని చేస్తా' అంటూ మాటిచ్చారు.