ముందస్తుకి గ్రౌండ్ వర్క్ పూర్తయింది

ముందస్తుకి గ్రౌండ్ వర్క్ పూర్తయింది

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ఖాయమే. అసెంబ్లీని రద్దు చేస్తూ రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేయడమే తరువాయి. కేసీఆర్ కదలికలు, ఇటీవల ఆయన వ్యాఖ్యలు, ప్రధానితో భేటీలు చూస్తుంటే తెలంగాణ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు ఖాయమన్న ఊహాగానాలే నిజం కానున్నాయి. ఢిల్లీలో ప్రధాని మోడీని, కేంద్ర మంత్రుల్ని కలిసిన సీఎం కేసీఆర్ మరికాసేపట్లో హైదరాబాద్ వస్తున్నారు. రేపు కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ మేరకు సెక్రటరీలకు నోటీసులు కూడా వెళ్లాయి.

కేబినెట్ భేటీలో ప్రధాని, ఇతర మంత్రులతో తన సమావేశాల గురించి మంత్రులకు సీఎం కేసీఆర్ వివరిస్తారు. ఈ భేటీలో అసెంబ్లీ రద్దు ప్రకటన తేదీ కూడా ఖరారు కానుంది. ముందస్తు ఎన్నికల కోసం తను చేసిన ఏర్పాట్లు, అందుకు అనుసరించాల్సిన వ్యూహాలను వారికి వివరిస్తారు. ఎన్నికలను ఎదుర్కొనేందుకు సమయం తక్కువ కనుక ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించేందుకు మంత్రులకు బాధ్యతలు కేటాయిస్తారు. మీడియాలో వస్తున్న ఊహాగానాల ప్రకారం రేపు అసెంబ్లీ రద్దుపై ప్రకటన చేయకుండా జ్యోతిష్యాన్ని నమ్మే సీఎం కేసీఆర్ ముహూర్తబలం ప్రకారం తన నిర్ణయాన్ని ప్రకటిస్తారు. 

పాజిటివ్ ఓటు కోసం రైతుబంధు, కేసీఆర్ కిట్స్ వంటి జనాకర్షక పథకాలు ఇప్పటికే అమలు చేస్తున్న సీఎం కేసీఆర్, శాసనసభ రద్దు చేసిన తర్వాత ప్రస్తుత ప్రాజెక్టులను సత్వరం పూర్తయ్యేందుకు పూర్తి సహాయసహకారాలు అందిస్తామని కేంద్రం నుంచి హామీలు పొంది వచ్చారు. పలు పథకాల అమలులో లోపాలు, అక్రమాలపై ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు సిద్ధమైన ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు కేసీఆర్ ఢిల్లీ వెళ్లి పూర్తిస్థాయిలో గ్రౌండ్ వర్క్ చేసి వచ్చారు. ఎన్నికల ప్రకటన వచ్చేలోపు ప్రస్తుత పథకాలు, ప్రాజెక్టులను పరుగులు పెట్టించైనా పూర్తిచేసి ఆ క్రెడిట్ తన ఖాతాలో పడేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే సీఎం కేసీఆర్ అసెంబ్లీ రద్దు ప్రకటన చేయనున్నారు.

సెప్టెంబరు 28 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించక ఆరు నెలలు అవుతుంది. ఆ లోపు సమావేశాలు తప్పక నిర్వహించాల్సి ఉంది. ఆ లోపే అసెంబ్లీని రద్దు చేయాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంటే అసెంబ్లీ రద్దవుతుంది. అసెంబ్లీ రద్దయిన రోజు నుంచి 6 నెలల్లో ఎన్నికలు నిర్వహించాలి. ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాలతో కలిపి తెలంగాణ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరపాలా? వద్దా? అనేది ఎన్నికల సంఘం నిర్ణయించాల్సి ఉంది.