కాగితం - కలం శాఖ కాదు పొలం - హలం శాఖగా మారాలి !

కాగితం - కలం శాఖ కాదు పొలం - హలం శాఖగా మారాలి !

తెలంగాణ రాష్ట్రంలో సాగు విస్తీర్ణం బాగా పెరిగిన నేపథ్యంలో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల ప్రాధాన్యం, బాధ్యత ఎంతో పెరిగిందని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. వ్యవసాయ శాఖ కాగితం - కలం శాఖగా కాకుండా పొలం - హలం శాఖగా మారాలని కెసిఆర్ పిలుపునిచ్చారు. ఈ రెండు శాఖల పనితీరులో గుణాత్మక, గణనీయమైన మార్పు రావాలని ఆయన పిలుపునిచ్చారు. వ్యవసాయంలో పంటల మార్పిడి విధానం, యాంత్రీకరణ, ఆధునిక సాగు పద్ధతులు పెంపొందించేందుకు వ్యవసాయ శాఖ తీవ్రంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని కెసిఆర్ చెప్పారు. రైతులు పండించిన పంటలను మార్కెట్ లో అమ్ముకునేందుకు సరైన పద్ధతులు అవలంబించే బాధ్యత మార్కెటింగ్ శాఖ పై ఉందని అన్నారు. కేంద్రం తెచ్చిన కొత్త చట్టాల ఫలితంగా దేశవ్యాప్తంగా మార్కెటింగ్ వ్యవస్థ ఎలా పరిణామం చెందినప్పటికీ, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం సజీవంగా ఉంచడమే కాకుండా మరింత బలోపేతం చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 

పదిరోజుల్లోగా రాష్ట్రంలోని ఏ గుంటలో ఏ పంట వేసారనే విషయంలో సరైన లెక్కలు తీయాలని కెసిఆర్ చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన రైతు వేదికలను వెనువెంటనే వాడుకలోకి తేవాలని, రైతులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఏఈఓ, రైతు బంధు సమితి కార్యాలయాలు కూడా రైతువేదికలోనే భాగంగా ఉండాలనీ, ఇందుకు అవసరమైన ఫర్నీచర్, ఇతర వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రగతిభవన్ లో ఆదివారం జిల్లా స్థాయి వ్యవసాయాధికారులు, మార్కెటింగ్ శాఖాధికారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. అన్ని జిల్లాలకు చెందిన అధికారుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. వ్యవసాయాభివృద్ధి-రైతు సంక్షేమం విషయంలో ఈ రెండు శాఖలు నిర్వహించాల్సిన బాధ్యతలను ముఖ్యమంత్రి విడమర్చి చెప్పారు.