'ఓటుకు నోటు'పై సీఎం ఆరా..

'ఓటుకు నోటు'పై సీఎం ఆరా..

తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి ఇవాళ ప్రగతి భవన్‌లో పోలీసు అధికారులతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశమయ్యారు. ఇందులో భాగంగా ఓటుకు నోటు కేసు పురోగతిని కేసీఆర్‌ అడిగి తెలుసుకున్నట్టు తెలిసింది. ముఖ్యంగా.. ఇటీవల వచ్చిన ఫోరెన్సిక్‌ నివేదికపై చర్చించినట్టు సమాచారం. అలాగే.. పలు ఏసీబీ కేసుల వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తోంది. నిన్న గవర్నర్‌తో సుదీర్ఘంగ చర్చించిన సీఎం కేసీఆర్‌.. ఈరోజు పోలీసు అధికారులతో సమావేశమవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రగతి భవన్‌లో జరిగిన సమావేశంలో డీజీపీ మహేందర్‌రెడ్డి, ఏసీబీ డీజీ పూర్ణచంద్రరావు, ఏసీబీ రిటైర్డ్‌ డీజీ ఏకే ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.