ప్రచారానికి సిద్ధమైన గులాబీ బాస్..

ప్రచారానికి సిద్ధమైన గులాబీ బాస్..

సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది... ఇక అన్ని పార్టీలు ప్రచార వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయగాన్ని అందుకున్న గులాబీ పార్టీ.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం మినహా క్లీన్‌స్వీప్ చేయడంపై దృష్టిపెట్టింది. ఇప్పటికే పార్లమెంట్ సన్నాహాక సమావేశాలను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహిస్తుండగా.. ఇక గులాబీ బాస్‌ కేసీఆర్ కూడా ప్రచారానికి సిద్ధమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సుడిగాలి పర్యటనలు చేసి.. పార్టీకి మెజార్టీ సీట్లు సాధించిన కేసీఆర్. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే వ్యూహాన్ని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 19వ తేదీన ఆయన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. 19వ తేదీన నిజామాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు టీఆర్ఎస్ శ్రేణులు సిద్ధ మవుతున్నాయి. ఓవైపు పార్టీ శ్రేణుల్లో కేటీఆర్ ఉత్సాహం నింపుతుండగా.. ఇక కేసీఆర్ ప్రచారానికి వస్తే టీఆర్ఎస్‌కు మరింత మెజార్టీ తెచ్చిపెడుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కాగా, రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలకు తొలి విడతలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 18న నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ ప్రకటించారు. నామినేషన్ల స్వీకరణకు మార్చి 25 తుది గడువు కాగా.. మార్చి 26న నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు గడువు మార్చి 28 వరకు ఉంటుంది. ఏప్రిల్ 11న పోలింగ్, మే 23న ఎన్నికల ఫలితాలు ప్రకటించనున్నారు.