ఉన్నతాధికారులకు కేసీఆర్‌ కీలక ఆదేశాలు

ఉన్నతాధికారులకు కేసీఆర్‌ కీలక ఆదేశాలు

అవినీతికి ఆస్కారం లేని విధంగా, ప్రజలకు పారదర్శకంగా సేవలు అందేలా, ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి జరిగేలా తెలంగాణ నూతన అర్బన్‌ పాలసీని రూపొందించాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కొత్త అర్బన్‌ పాలసీ విధివిధానాలపై అధికారులకు ఇవాళ కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. నూతన అర్బన్ పాలసీలో భాగంగా నూతన మున్సిపల్ చట్టం, నూతన కార్పొరేషన్ చట్టం, నూతన హైదరాబాద్ నగర కార్పొరేషన్ చట్టం తీసుకురావాలని సూచించారు. రెండు మూడు రోజుల్లోనే ఈ చట్టాల ముసాయిదా తయారు చేయాలని స్పష్టం చేశారు. త్వరలోనే అసెంబ్లీని సమావేశ పరిచి కొత్త చట్టాలు తెస్తామని అధికారులకు సీఎం తెలిపారు. ఈ చట్టాల ప్రకారమే నగల పాలన జరిగే విధంగా అధికారులు, ప్రజాప్రతినిధులకు బాధ్యత అప్పగించాలని నిర్ణయించామన్నారు. 

కొత్తగా పంచాయతీ రాజ్‌ చట్టాన్ని చేశామని, ఇదే విధంగా రెవెన్యూ, మున్సిపల్‌ చట్టాలు కూడా రావాలన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో రాష్ట్ర ప్రాధాన్యతలు గుర్తించామన్న కేసీఆర్‌.. సంక్షేమ రంగానికి అధిక ప్రాధాన్యమిచ్చామని చెప్పారు. రాష్ట్రం మరో మెట్టు ఎక్కాల్సిన తరుణంలో మంచి విధానాలు రావాల్సిన అవసరముందని  అభిప్రాయపడ్డారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత విషయంలో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.