కేసీఆర్‌ను నేను ఆహ్వానించలేదు

కేసీఆర్‌ను నేను ఆహ్వానించలేదు
ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రయత్నాలకు ఒడిషా సీఎం నవీన్‌ పట్నాయక్ కొత్త  ట్విస్ట్ ఇచ్చారు.  ఫెడరల్‌ ఫ్రంట్‌పై చర్చలకు  కేసీఆర్‌ను తాను ఆహ్వానించలేదని పట్నాయక్‌ మీడియాతో అన్నారు. కేసీఆర్‌ స్వయంగా తనకు ఫోన్‌ చేసి..  భేటీకి ఆసక్తి చూపడంతో తాను సరేనన్నానని ఆయన స్పష్టం చేశారు. తమ మధ్య ఫెడరల్‌ ఫ్రంట్‌ గురించి ఎలాంటి చర్చ జరగలేదన్నారు. “దైవదర్శనం కోసం  కేసీఆర్‌ పూరి వెళుతున్నారు, మర్యాదపూర్వకంగా ఆయన నాతో భేటీ అవుతున్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ లేదా ఇతర రాజకీయ చర్చలేవీ తమ మధ్య జరగడం లేద’ని పట్నాయక్‌ మీడియాతో అన్నారు. పట్నాయక్‌ ప్రకటనతో తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వెలువడిన పత్రికా ప్రకటనపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు కోసం కేసీఆర్‌ తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నారని.. అందులో భాగంగా ఆయన ఒడిషా సీఎం పట్నాయక్‌ తో భేటీ అవుతున్నారని సీఎంఓ పేర్కొంది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున... మే నెల తొలి వారంలో రెండు రాష్ట్రాల సీఎంల మధ్య భేటీ జరగుతుందని సీఎంఓ పేర్కొంది. ఇంతకుమునుపు పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జి ఆహ్వానం మేరకు  కేసీఆర్‌ కోల్‌కతా వెళ్ళినట్లు తెరాస వర్గాలు ప్రకటించడం... అయితే తాను ఆహ్వానించలేదని... కేసీఆర్‌ స్వయంగా ఫోన్‌ చేసి వచ్చారని మమతా కార్యాలయం వివరణ ఇవ్వడంతో... ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుపై పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.