ప్లీజ్‌.. అవమానించకండి: దిండా

ప్లీజ్‌.. అవమానించకండి: దిండా

బెంగాల్‌ బౌలర్‌ అశోక్‌ దిండాను హేళన చేస్తూ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు ట్వీట్‌ చేయడం వివాదాస్పదమైంది. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో  జరిగిన మ్యాచ్‌లో ఉమేష్‌ యాదవ్‌ 3 వికెట్లు పడగొట్టగా.. అతన్ని ప్రశంసించే క్రమంలో దిండాను హేళన చేస్తూ ఆర్సీబీ ట్వీట్‌ చేసింది. దిండా అకాడమీనా? అదేంటి? అంటూ పోస్ట్‌ పెట్టింది. కొద్దిసేపటికే ఆ ట్వీట్‌ను డిలీట్‌ చేసినా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరగిపోయింది. 

2017 ముందు జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లతోపాటు 2010-2013 మధ్య  భారత్ తరపున ఆడిన మ్యాచుల్లోనూ ప్రత్యర్థులు దిండా బౌలింగ్‌ను చీల్చిచెండాడేవారు. అందుకే.. ఎవరైనా బౌలర్ అధికంగా పరుగులు ఇస్తే.. అతడిని దిండా తో పోలుస్తూ సోషల్‌ మీడియాలో ఎగతాళి చేయడం ఆరంభించారు. ఇప్పుడు ఆర్సీబీ కూడా ట్రోల్‌ చేయడంతో దిండా బాధపడ్డాడు. 

'నేను వరల్డ్‌ బెస్ట్‌ బౌలర్‌ని కాదన్న విషయం తెలుసు. కానీ.. నేను ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డాను. ఎన్నో రోజులు ఆహారం లేకుండా క్రికెట్‌ మైదానాల్లో పడుకున్నాను.క్రికెట్‌ ఆడటానికి రేయింబవళ్లు ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు. నాకు మద్దతివ్వడం మీకు ఇష్టం లేకపోతే వదిలేయండి.. కానీ నా ఆటను అవమానించకండి' అంటూ తన ఆవేదనను వ్యక్తం చేస్తూ ఓ పోస్టు పెట్టాడు దిండా. 

అలాగే.. ' హేటర్స్‌.. నా ఈ లెక్కలు చూడండి. నాపై అనవసరంగా నోరుపారేసుకోవడం ఆపండి' అని పేర్కొంటూ.. గత 9 సీజన్ల రికార్డును షేర్‌ చేశాడు. 9 సీజన్లుగా బెంగాల్‌ రంజీ జట్టు తరఫున తానే ఎక్కవ వికెట్లు తీశానని, ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో మొత్తం 400 వికెట్లు పడగొట్టానని గుర్తుచేశాడు. భారత జట్టు తరఫున 13 అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లు ఆడిన దిండా 12 వికెట్లు పడగొట్టాడు. 9 టీ20ల్లో 17 వికెట్లు పడగొట్టాడు.