రంజాన్ ఉపవాస దీక్ష పాటిస్తున్న హిందూ ఖైదీలు!!

రంజాన్ ఉపవాస దీక్ష పాటిస్తున్న హిందూ ఖైదీలు!!

ఎన్నో ఏళ్లుగా హిందువులు, ముస్లింలు పవిత్ర రంజాన్ మాసంలో కలిసి రోజా ఉపవాస దీక్ష పాటిస్తున్నారు. ఈ నియమం దేశంలోని మత సామరస్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. తాజాగా ఉపవాస దీక్ష పాటిస్తున్న ముస్లింలతో పాటు ఢిల్లీలోని 100 మంది హిందూ ఖైదీలు రోజా ఉంటున్నారు. ఖైదీలు క్రమశిక్షణగా ఉండేందుకు, తమ సమయాన్ని మరింత సమర్థంగా ఉపయోగించేందుకు ఇది సాయపడుతోంది.

ఈ ఏడాది పవిత్ర రంజాన్ మాసంలో 31 హిందూ మహిళా ఖైదీలు, 12 మంది హిందూ కౌమార బందీలు రోజా ఉపవాస దీక్షను పాటిస్తున్నారు. వీరికి జైలు అధికారులు సైతం యథాశక్తి సాయపడుతున్నారు. ప్రతిరోజూ సూర్యాస్తమయ సమయాలను సూచించే బోర్డులు పెడుతున్నారు. ఉపవాస దీక్ష పాటిస్తున్న ఖైదీల కోసం ఖర్జూరాలు, రూహ్ ఆఫ్జా తెప్పిస్తున్నారు. సెహ్రీ, ఇతర ప్రార్థనల తర్వాత వీళ్లకి ఆహారం లభించే విధంగా లంగర్ సమయాలను కూడా మార్చారు. 

ఖైదీలు కొనుక్కొనేందుకు వీలుగా జైలులోని క్యాంటీన్లలో రూహ్ ఆఫ్జా, ఖర్జూరాలు, తాజా పళ్లు నిల్వ ఉంచుతున్నారు. అన్ని సెంట్రల్ జైళ్లలో రోజా ఇఫ్తార్ కు ఏర్పాట్లను చేస్తున్నారు. ప్రార్థనలు జరిపేందుకు, ఖైదీలతో రోజా ఇఫ్తార్ స్వీకరించేందుకు ధార్మిక, స్వచ్ఛంద సంస్థలకు అనుమతినిస్తున్నారు. ఢిల్లీలో తీహార్, రోహిణి, మండోలి జైళ్లు ఉన్నాయి.

రంజాన్ ఉపవాస దీక్ష సూర్యోదయానికి ముందు ఆహారం స్వీకరించడంతో ప్రారంభమవుతుంది. దీనిని సెహ్రీ అంటారు. ఇందులో రొట్టె, కూరగాయలు, పళ్లు, పెరుగు, టీ, కాయధాన్యాలు, బీన్స్ ఉంటాయి. సూర్యాస్తమయం తర్వాత ఉపవాసాన్ని విరమిస్తారు. కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో కలిసి స్వీకరించే ఆహారాన్ని ఇఫ్తార్ అంటారు. 

1,400 ఏళ్ల క్రితం మహమ్మద్ ప్రవక్త ఉపవాస దీక్ష విరమించిన సంప్రదాయ పద్ధతిలో ముస్లిలు తియ్యని ఖర్జూరాలు తిని, నీళ్లు తాగి విరమిస్తారు. ఆ తర్వాత సూర్యాస్తమయ ప్రార్థన చేస్తారు.