కేరళలో నలుగురు కుటుంబసభ్యులు హత్య

కేరళలో నలుగురు కుటుంబసభ్యులు హత్య

దేశరాజధానిలో సంచలనం రేపిన బురారీ సామూహిక ఆత్మహత్యల ఘటన మరువక ముందే కేరళలో ఓ కుటుంబంలోని నలుగురు సభ్యులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఇడుక్కి జిల్లాలోని తొడుపుజ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ కుటుంబానికి చెందిన వారిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి ఇంటి వెనుకే గొయ్యి తవ్వి నలుగురినీ ఒకరిపై ఒకరిని పెట్టి పూడ్చేశారు. 

ఇంట్లోని వ్యక్తులు రెండు మూడు రోజులుగా బయటకు రాకపోవడంతో పక్కింటి వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. ఇంట్లోకి వెళ్లి చూడటంతో అక్కడక్కడా రక్తపు మరకలు కనిపించాయి. ఇంటి వెనక పరిశీలించగా, ఓ చోట గోయ్యి లో పూడ్చిపెట్టిన ఆనవాళ్లు కనిపించాయి. అనుమానం వచ్చి తవ్వడంతో నాలుగు మృతదేహాలు బయటపడ్డాయి. మృతులు భార్యభర్తలైన కే.కృష్ణన్‌, సుశీల, వారి కుమారుడు, కుమార్తె అయిన అర్జున్, అర్ష గా గుర్తించారు. 

ఘటనా స్ధలంలో దొరికిన కత్తి, సుత్తెను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుత్తెతో బలవంతంగా కొట్టడంతో వారు చనిపోయినట్లు తెలుస్తుంది. ఆదివారం వారిని చంపి పూడ్చిపెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం కోట్టాయం ప్రభుత్వాసుప్రతికి పంపించారు. ఈ హత్యలో ఇద్దరు కంటే ఎక్కువ మంది ప్రమేయం ఉండోచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. 

వీరి మరణాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంట్లోని వారు ఎవరితో ఎక్కువగా మాట్లాడేవారు కాదని స్థానికులు తెలిపారు. ఇంటి యజమాని జ్యోతిష్కుడని, తాంత్రికపూజలు నిర్వహించేవాడని పోలీసులు అనుమానిస్తున్నారు. చేతబడి చేసి చంపేశారనే కోణంలో దర్యప్తు మొదలుపెట్టారు పోలీసులు. రాత్రిపూట వారింటికి చాలా మంది వచ్చి వెళ్తుంటారని పక్కింటి వారు పోలీసులకు తెలిపారు.