కేరళలో జల ప్రళయం

కేరళలో జల ప్రళయం

కేరళలో వరద బీభత్సం సృష్టిస్తోంది. ఎక్కడ చూసిన హృదయ విదారక దృష్యాలే. ప్రజలకు తినటానికి తిండిలేక, తాగటానికి నీళ్లు లేక నానా అవస్థలు పడుతున్నారు. ఇవాళ ఒక్కరోజే దాదాపు 23 మంది వరదతాకిడికి మృతి  చెందారంటే పరిస్థితి ఇట్లే అర్థమవుతోంది. రాష్ట్ర మంతటా రెస్యూ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. ఐనా పరిస్థితిలో మార్పు కనిపించటం లేదు. వరద దాడికి జనం గుండెలు బాదుకుంటున్నారు. రాష్ట్రానికి పలు ప్రాంతాలకు సంబంధాలు తెగిపోయాయి. రోడ్లు పూర్తిగా నాశనమయ్యాయి. పాలు లేక పిల్లల ఏడుపులు, మందులు లేక వృద్ధులు పరిస్థితి వర్ణనాతీతం. 

ప్రధాని మోడీ రాత్రి కేరళ చేరుకుని ఇవాళ కొచ్చి, ఇడుక్కీ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. వరద సహాయంగా రూ.500 కోట్లు ప్రకటించారు. పూర్తి నష్టాన్ని అంచనా వేయటం కష్టంగా మారింది. దైవ దేశంగా భావించే కేరళలో ఇప్పటికే వందల మంది మృత్యువాత పడ్డారు. కొండ చరియలు విరిగిపడి ప్రజలు రవాణ ఎక్కడిక్కడ స్థంబించింది. గత వందేళ్లలో ఎప్పుడు ఇలాంటి ఉపద్రవం సంభవించలేదని చెబుతున్నారు.  మంగళవారానికి పరిస్థితులు కొంత మెరుగుపడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సుమారు 4లక్షల మంది పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారని అంచనా వేస్తున్నారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్స్ , ఎన్డీఆర్ఎఫ్ దళాలు బాధితులను ఆదుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. 

బాధితులను ఆదుకునేందుకు పలు రాష్ట్రాల నుంచి సాయం అందుతోంది. ఆప్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ నెల జీతం విరాళంగా ఇవ్వనున్నట్లు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. ఒడిస్సా సీఎం రూ. 5కోట్లు, బీహార్, హర్యానా, ఏపీ రూ.10 కోట్లు, తెలంగాణ సీఎం రూ.25 కోట్లు సహాయం ప్రకటించారు. కేరళ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని రాహుల్ డిమాండ్ చేశారు.