ముస్లింలీగ్ ఎమ్మెల్యేను డిస్మిస్ చేసిన హైకోర్టు

ముస్లింలీగ్ ఎమ్మెల్యేను డిస్మిస్ చేసిన హైకోర్టు

ముస్లింలీగ్ ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదంటూ కేరళ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో కన్నూర్ జిల్లా, అజిక్కోడ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యే కె.ఎం.షాజీ ఎన్నిక చెల్లదని, అందుకు ప్రతివాదికి రూ. 50 వేలు చెల్లించాలంటూ జరిమానా కూడా విధించింది. అటు నియోజకవర్గంలో వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ఈసీని ఆదేశించింది. ముస్లింలీగ్ ఎమ్మెల్యే షాజీపై సీఎంపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన ఎం.వి.నికేశ్ కుమార్ కోర్టుకెక్కారు. మతతత్వాన్ని రెచ్చగొట్టి, ప్రజల్ని ప్రభావితం చేసి గెలిచాడని ఆయన ఫిర్యాదు చేశారు. 

అయితే ఎన్నికల సమయంలో కొన్ని వాల్ పోస్టర్లలో ఉన్న అభ్యంతరకరమైన అంశాలు తమ దృష్టికి కూడా వచ్చాయని, వెంటనే తాము వాటిని ఉపసంహరించుకున్నామని ముస్లింలీగ్ పార్టీ ప్రకటించింది. తమ పార్టీని, అభ్యర్థిని చెడుగా చూపించడానికి ప్రత్యర్థులు ఈ కుతంత్రం పన్నారని, దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని ఆ పార్టీ ప్రకటించింది.