చివరి దశ ఎన్నికల్లో కీలక స్థానాలివే!

చివరి దశ ఎన్నికల్లో కీలక స్థానాలివే!

శుక్రవారంతో లోక్ సభ ఎన్నికల్లో చివరిదైన ఏడో  దశ ప్రచారానికి తెరపడింది. ఏడో దశలో 59 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఓటింగ్ జరగనుంది. ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని ఈ స్థానాల్లో 10.17 కోట్ల మంది ఓటర్లు ఆదివారం 918 మంది అభ్యర్థుల జయాపజయాలను నిర్ణయించనున్నారు. ఎన్నికలు జరగనున్న 59 స్థానాల్లో కీలక స్థానాలు, వాటి అభ్యర్థుల వివరాలపై అంతటా ఆసక్తి వ్యక్తమవుతోంది. ఈ ఎన్నికల బరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, కేంద్ర మంత్రులు మనోజ్ సిన్హా, రవిశంకర్ ప్రసాద్, సన్నీ డియోల్, కిరణ్ ఖేర్, హర్ సిమ్రత్ కౌర్ బాదల్, శత్రుఘ్న సిన్హా, పవన్ కుమార్ బన్సల్, ప్రణీత్ కౌర్, మీసా భారతి, అభిషేక్ బెనర్జీ వంటి హేమాహేమాలు ఉన్నారు.

చండీగఢ్:
చండీగఢ్ లోక్ సభ నియోజకవర్గం చండీగఢ్ కేంద్ర పాలి ప్రాంతం అంతటా విస్తరించి ఉంది. 2014లో బీజేపీకి చెందిన కిరణ్ ఖేర్ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అభ్యర్థి గుల్ పనాగ్, కాంగ్రెస్ అభ్యర్థి పవన్ కుమార్ బన్సల్ లను ఓడించారు. మరోసారి కిరణ్ ఖేర్, బన్సల్ తలపడుతున్నారు. ఆప్ తరఫున హర్ మోహన్ ధావన్ నిలిచారు.

ఇండోర్ (మధ్యప్రదేశ్):
లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఇండోర్ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయరాదని ఆమె నిర్ణయించుకోవడంతో బీజేపీ తన అభ్యర్థిగా శంకర్ లాల్వానీని నిలిపింది. ఆయన కాంగ్రెస్ అభ్యర్థి పంకజ్ సంఘ్వీని ఢీ కొంటున్నారు.

వారణాసి(ఉత్తరప్రదేశ్): 
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి వారణాసి స్థానం నుంచి పోటీ చేస్తుండటంతో అందరి దృష్టి ఈ స్థానంపై నిలిచింది. గత ఎన్నికల్లో మోడీ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ను 3.7 లక్షల ఓట్ల తేడాతో చిత్తు చేశారు. ఈ సారి ఆయన కాంగ్రెస్ నుంచి అజయ్ రాయ్, సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ)కి చెందిన శాలినీ యాదవ్ లను ఎదుర్కోనున్నారు. 

గోరఖ్ పూర్ (ఉత్తరప్రదేశ్): 
రవీంద్ర శ్యామ్ నారాయణ్ శుక్లా అంటే పెద్దగా తెలియకపోవచ్చు కానీ భోజ్ పురీ సూపర్ స్టార్ రవికిషన్ అంటే తెలియనివాళ్లు ఉండరు. గత ఎన్నికల్లో జౌన్ పూర్ నుంచి కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేసిన రవికిషన్, ఈ సారి గోరఖ్ పూర్ బీజేపీ అభ్యర్థిగా నిలబడ్డారు. గోరఖ్ పూర్ యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు కంచుకోట. కానీ ఉప ఎన్నికల్లో ఎస్పీ దీనిని కైవసం చేసుకుంది. ఇప్పుడు రవికిషన్ కాంగ్రెస్ నేత మధుసూదన్ త్రిపాఠి, ఎస్పీకి చెందిన రాంభువల్ నిషాద్ లతో తలపడబోతున్నారు.

మీర్జాపూర్(ఉత్తరప్రదేశ్): 
ఈ స్థానం నుంచి బీజేపీ-అప్నాదళ్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ కేంద్ర మంత్రి అనుప్రియ సింగ్ పటేల్ పోటీ చేస్తున్నారు. ఆమె ఎస్పీ అభ్యర్థి రాంచరిత్ర నిషాద్, కాంగ్రెస్ తరఫున నిలిచిన లలితేష్ పతి త్రిపాఠి ఢీ కొట్టబోతున్నారు.

డైమండ్ హార్బర్ (పశ్చిమ బెంగాల్): 
కోల్ కతా నగరానికి దక్షిణంగా ఉంటుంది డైమండ్ హార్బర్. ఈ స్థానం నుంచి ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి నీలాంజన్ రాయ్ తో ముఖాముఖి పోరు సాగనుంది. 

బసిర్హట్(పశ్చిమ బెంగాల్): 
సరిహద్దుల్లో ఉండే ఈ నియోజకవర్గంలో హై వోల్టేజీ పోరు సాగనుంది. టీఎంసీ తన అభ్యర్థిగా ఫిలిం స్టార్ నుస్రత్ జహాన్ ను నిలిపింది. బీజేపీ తరఫున సాయంతన్ బసు బరిలోకి దిగారు.

కోల్ కతా దక్షిణ్: 
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 1991 నుంచి 2011 వరకు 6 సార్లు గెలుసొంది పార్టీకి తిరుగులేని స్థానంగా మలచుకొన్న దక్షిణ కోల్ కతా సీటు నుంచి నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనవడు చంద్ర కుమార్ బోస్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన కాంగ్రెస్ కి చెందిన మీతా చక్రబొర్తి, టీఎంసీ అభ్యర్థి మాలా రాయ్, సీపీఎం తరఫున నిలిచిన నందిని ముఖర్జీలతో తలపడుతున్నారు.

పట్నా సాహిబ్(బీహార్): 
బీహార్ లోని పట్నా సాహిబ్ స్థానంలో ఈ సారి బీజేపీని వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్న బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హాను బీజేపీ నుంచి రవిశంకర్ ప్రసాద్ ఢీ కొంటున్నారు. 

పాటలీపుత్ర(బీహార్): 
ఆర్జేడీ అధినేత, మాజీ బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కి సన్నిహితుడిగా ఉన్న రామ్ కృపాల్ యాదవ్ మోడీ ఆకర్షణపై ఆశలు పెట్టుకొన్నారు. ఆయనపై లాలూ కుమార్తె మీసా భారతి పోటీ చేస్తున్నారు. 

దుమ్కా(ఝార్ఖండ్): 
ఇప్పటి వరకు తొమ్మిది సార్లు నెగ్గిన ఈ సీటులో ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, ఝార్ఖండ్ ముక్తి మోర్చా అధ్యక్షుడు శిబూ సోరెన్ మరోసారి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి పోటీ చేసిన ఆయన బీజేపీ అభ్యర్థి సునీల్ సోరెన్ ఓడించారు. ఈ సారి కూడా సునీల్ సోరెన్(బీజేపీ)నే ఆయనకు ప్రత్యర్థిగా సవాల్ విసురుతున్నారు.

ఆనంద్ పూర్ సాహిబ్(పంజాబ్):
ఆనంద్ పూర్ సాహిబ్ పంజాబ్ లో చాలా కీలకమైన లోక్ సభ స్థానం. ఇక్కడ అకాలీదళ్ అభ్యర్థిగా ప్రొఫెసర్ ప్రేమ్ సింగ్ చందూమాజరా, కాంగ్రెస్ తరఫున మనీష్ తివారీ, ఆప్ నుంచి నరీందర్ సింగ్ షేర్గిల్ పోటీ చేస్తున్నారు. ఈ స్థానం నుంచి ఏ పార్టీ అభ్యర్థి ఎన్నికైతే ఆ పార్టీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనే సెంటిమెంట్ ఉంది.

గురుదాస్ పూర్(పంజాబ్): 
గురుదాస్ పూర్ లో రెండు దిగ్గజ కుటుంబాల మధ్య రసవత్తర పోరు జరగనుంది. పంజాబ్ ద పుత్తర్ గా పేరున్న ధర్మేంద్ర పెద్ద కుమారుడు సన్నీ డియోల్ బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ఆయనకు కాంగ్రెస్ దిగ్గజ నేత బలరామ్ జక్కడ్ కుమారుడు సునీల్ జక్కడ్ సవాల్ విసురుతున్నారు.

అమృత్ సర్(పంజాబ్): 
గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన అరుణ్ జైట్లీని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఓడించారు. ఈ సారి కూడా అదే ఫీట్ సాధించాలని కెప్టెన్ పట్టుదలగా ఉన్నారు. అయితే బీజేపీ అభ్యర్థి హర్దీప్ సింగ్ పురి 1984 సిక్కు అల్లర్లపై కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడ్ 'అయిందేదో అయింది' వ్యాఖ్యలతో సెంటిమెంట్ రాజేస్తున్నారు. ఆయనను కాంగ్రెస్ నుంచి గుర్జీత్ సింగ్ ఔలియా ఢీ కొడుతున్నారు.

పటియాలా(పంజాబ్): 
పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ భార్య ప్రణీత్ కౌర్ పటియాలా లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. నాలుగోసారి అవకాశం కోరుతున్న ప్రణీత్ కౌర్ కు అకాలీదళ్ నుంచి సుర్జీత్ సింగ్ రాఖ్రా, ఆప్ కు చెందిన నీనా మిట్టల్ సవాల్ విసురుతున్నారు. అయితే రాజవంశీకురాలైన కౌర్ విజయం దాదాపుగా ఖాయమేనని అంటున్నారు.

బఠిండా(పంజాబ్): 
పంజాబ్ హాట్ సీట్లలో ఒకటిగా బఠిండాను చెబుతారు. అకాలీదళ్ కంచుకోటగా చెప్పే బఠిండాలో గెలుపును బాదల్ కుటుంబం తమ ప్రతిష్ఠకు సవాల్ గా తీసుకుంది. అకాలీదళ్ అభ్యర్థి హర్ సిమ్రత్ కౌర్ బాదల్, కాంగ్రెస్ కి చెందిన అమరీందర్ సిం గ్ రాజా వడింగ్ ల మధ్య హోరాహోరీ పోరు సాగనుంది.