ఈ యేడు ‘శ్రీ సప్తముఖ కాళసర్ప మహాగణపతి’గా...

ఈ యేడు ‘శ్రీ సప్తముఖ కాళసర్ప మహాగణపతి’గా...

హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ మహాగణపతి ప్రత్యేకం... దేశంలో ఎక్కడా లేని విధంగా ఓ భారీ గణనాథుడు ఊరేగింపుగా వెళ్లడం హైదరాబాద్‌లో మాత్రమే జరుగుతుంది. ఇతర నగరాల్లో భారీ వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసినా... అక్కడే నిమజ్జనం చేయాల్సిన పరిస్థితి. అయితే ఈ ఏడాది ఖైరతాబాద్‌ మహా గణప ‘శ్రీ సప్తముఖ కాళసర్ప మహా గణపతి’గా కొలువుదీరనున్నాడు. విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన వివరాలను ఖైరతాబాద్‌ ఉత్సవ కమిటీ ఛైర్మన్‌ సింగరి సుదర్శన్‌, విగ్రహ శిల్పి రాజేంద్రన్‌, ఉత్సవ కమిటీ విడుదల చేసింది. 

ఇక ఈ సారి కొలువుదీరనున్న ‘శ్రీ సప్తముఖ కాళసర్ప మహాగణపతి’ విగ్రహం ఎత్తు 57 అడుగులుగా వెడల్పు 24 అడుగులుగా ఉండనుంది. 60 అడుగుల తర్వాత ఏటా ఒక అడుగు తగ్గించాలనే నిర్ణయం ప్రకారం గత ఏడాదే 57 అడుగులుగా ఉండాల్సి ఉన్నా, 60 అడుగులుగా చేశారు. దాంతో గత ఏడాది ఉండాల్సిన 57 అడుగులు ఈ పర్యాయం రూపుదిద్దుకోనుంది. ఆలాగే వినాయకుడు ఏడు తలలు, 14 చేతులతో రూపుదిద్దుకోనున్నాడు. వినాయకుడి తలపై ఏడు సర్పాలతో విగ్రహం అలంకరణ కానుంది. పక్కనే ఏడు ఏనుగులు నమస్కరించే రూపంలో ఏర్పాటు కానున్నాయి. గణపతి మండపంలోనే కుడివైపున లక్ష్మీ, ఎడమ వైపున సరస్వతి విగ్రహాలు 14 అడుగుల ఎత్తున ఏర్పాటుచేయనుంది ఖైరతాబాద్‌ గణేష్ ఉత్సవ కమిటీ. ఇక ప్రస్తుతం వినాయక మండపం షెడ్డు నిర్మాణం, వెల్డింగ్‌ ఫ్రేమ్‌ వర్క్‌ పూర్తికాగా... వినాయకుడి పనులు జరగాల్సి తెలిపారు. ఇనుము, గన్నీ వస్త్రం, ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌, మట్టి, కొబ్బరి పీచు, వాటర్‌ పెయింట్స్‌ వాడనున్నట్లు ప్రకటించింది ఉత్సవ కమిటీ.