ఆజం ఖాన్ కు జాతీయ మహిళా కమిషన్ నోటీసులు

ఆజం ఖాన్ కు జాతీయ మహిళా కమిషన్ నోటీసులు

ఉత్తరప్రదేశ్ లోని ప్రముఖ రామ్ పూర్ సీటు ఉంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి జయప్రదపై అమర్యాదకరంగా వ్యాఖ్యానించిన కేసులో సమాజ్ వాదీ పార్టీ నేత ఆజం ఖాన్ కు జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యు) నోటీసులు పంపింది. అంతకు ముందు ఆజం ఖాన్ పై కేసు నమోదైంది. బీజేపీ ఆయనపై ఐపీసీ 509 (మహిళలపై అవమానకర వ్యాఖ్యలు), సెక్షన్ 125 కింద పోలీస్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

ఆజం ఖాన్ ఎప్పుడూ మహిళల గురించి అశ్లీలంగా మాట్లాడతారని ఎన్సీడబ్ల్యు చెప్పింది. ఈ ఎన్నికల్లో మహిళా రాజకీయ నాయకులపై ఆయన ఇలా వ్యాఖ్యానించడం ఇది రెండోసారి. సుమోటో కింద ఆజం ఖాన్ వ్యాఖ్యలను తీసుకున్న ఎన్సీడబ్ల్యు ఆయనకు నోటీసులు పంపింది.

ఆజం ఖాన్ పై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి లేఖ రాయనున్నట్టు ఎన్సీడబ్ల్యు చైర్ పర్సన్ రేఖా శర్మ తెలిపారు. ఆయన దీని నుంచి గుణపాఠం నేర్చుకోవాల్సిందేనని వ్యాఖ్యానించారు. ఆయన చాలా అతి చేస్తున్నారని, దీనిని అడ్డుకోవాల్సిందేనని అన్నారు. మహిళలు సెక్స్ వస్తువులు కాబోరన్న రేఖా శర్మ, మహిళలపై అశ్లీల వ్యాఖ్యలు చేసే ఇలాంటి వ్యక్తులకు మహిళా ఓటర్లు ఓటు వేయరాదని అభిప్రాయపడ్డారు.  

మహాకూటమి అభ్యర్థిగా రామ్ పూర్ నుంచి పోటీ చేస్తున్న ఆజమ్ ఖాన్, తహసీల్ షాబాద్ బహిరంగ సభలో అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. 'వేలు పట్టుకొని రామ్ పూర్ కి తెచ్చాను. 10 ఏళ్ల పాటు మీరు ఆమెను మీ ప్రతినిధిగా ఎన్నుకున్నారు. ఆవిడ నిజస్వరూపం అర్థం అయ్యేందుకు మీకు 17 ఏళ్లు పట్టింది. నాకు 17 రోజుల్లోనే ఆమె అండర్ వేర్ రంగు ఖాకీ అని తెలిసిపోయిందని' వ్యాఖ్యానించారు.