29న 'కియా మోటార్స్' మొదటి కారు

29న 'కియా మోటార్స్' మొదటి కారు

దేశంలో కార్లు ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ కూడా చేరబోతోంది. అనంతపురం జిల్లా పెనుగొండ మండలం ఎర్రమంచి గ్రామం వద్ద దక్షిణ కొరియా కార్ల దిగ్గజం 'కియా మోటార్స్ ఇండియా' కంపెనీ ప్లాంట్ పూర్తయింది. తన మొదటి కారును ఈనెల 29 ఏపీ సీఎం చంద్రబాబు చేతుల మీదుగా మార్కెట్ లోకి విడుదల చేయనుంది. కియా మోటార్స్ కు ఇది ప్రపంచంలోనే 15వ ప్లాంట్. బిలియన్ డాలర్లు వెచ్చించి నిర్మించిన ఈ ప్లాంట్ కు ఏడాదికి 3 లక్షల యూనిట్ల వాహనాల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది. ప్లాంట్‌ నుంచి విడుదల చేసే కార్లను విక్రయించుకునేందుకు డీలర్‌ నెట్‌వర్కును దేశ వ్యాప్తంగా విస్తరించబోతోంది. భారత మార్కెట్లో తన కార్లను కొనుగోలుదారులకు మరిం త చేరువ చేసేందుకు సరైన ప్రచారకర్త (బ్రాండ్‌ అంబాసిడర్‌)ని నియమించాలని కూడా కియా మోటార్స్‌ ఇండియా భావిస్తోంది. ప్రస్తుత అంతర్జాతీయ మార్కెట్‌ కియా మోటార్స్‌ కార్లకు టెన్నిస్‌ స్టార్‌ రఫెల్‌ నడాల్‌ ప్రచారకర్తగా ఉన్నారు. భారత మార్కెట్‌ కోసం కూడా ప్రత్యేకంగా ప్రచారకర్తను నియమించనుంది.

కంపెనీ 200 కోట్ల డాలర్ల (సుమారు రూ.14,200 కోట్లు) పెట్టుబడితో రెండు దశల్లో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఇందులో మొదటి దశ కోసం 110 కోట్ల డాలర్ల వరకు ఖర్చు చేస్తోంది. 2021 నాటికి మరో 80 కోట్ల డాలర్ల పెట్టుబడితో అనంతపురం ప్లాంట్‌ ఉత్పత్తి సామర్ధ్యాన్ని విస్తరించాలని భావిస్తోంది. రెండో దశ విస్తరణతో ప్రత్యక్ష ఉద్యోగుల సంఖ్య 10,000కు చేరుతుందని అంచనా. అలాగే స్థానికంగా ఉత్పత్తి అయ్యే వీలైనన్ని విడి భాగాలను వినియోగించడం ద్వారా కార్ల ఉత్పత్తి ఖర్చుల్ని తగ్గించుకోవాలని కియా మోటార్స్‌ భావిస్తోంది. ఇందుకోసం ప్లాంట్‌ ఏర్పాటు చేస్తున్న ఎర్రమంచి గ్రామంతో పాటు సమీపంలోని గుడిపల్లి గ్రామం దగ్గర 250 ఎకరాల్లో ఆటోమొబైల్‌ విడి భాగాలు తయారు చేసే అనుబంధ కంపెనీలు ఏర్పాటవుతున్నాయి.