మంత్రి పదవికి కిడారి శ్రావణ్‌ రాజీనామా..

మంత్రి పదవికి కిడారి శ్రావణ్‌ రాజీనామా..

ఆంధ్రప్రదేశ్‌ మంత్రి కిడారి శ్రవణ్‌ కుమార్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అమరావతిలోని ఏపీ సచివాలయంలో సీఎంవో అధికారులను కలిసిన ఆయన.. తన రాజీనామా లేఖను అందజేశారు. ఇక సీఎంవో ద్వారా గవర్నర్‌ నరసింహన్‌కు ఈ రాజీనామా లేఖ వెళ్లనుంది. కాగా, గత ఏడాది నవంబర్ 11వ తేదీన ఏపీ కేబినెట్‌ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కిడారికి.. ఆంధ్రప్రదేశ్‌ వైద్య, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా నియమించారు చంద్రబాబు. అయితే, రాజ్యాంగ నియమావళి ప్రకారం మంత్రిగా ప్రమాణస్వీకారం చేసినవాళ్లు.. ఆరు నెలల్లోగా చట్టసభకు ఎన్నిక కావాలి. శ్రావణ్‌కు ఆరునెలల వ్యవధి ఈ నెల 10వ తేదీతో ముగియనుంది. రాజ్యాంగ ప్రకారం ఆయన 11వ తేదీ నుంచి మంత్రిగా కొనసాగడానికి అవకాశం లేదు. దీంతో ఆయన మంత్రి పదవి ఊడిపోతుంది. అయితే, అది అవమానకరంగా ఉంటుంది కాబట్టి... ముందే రాజీనామా చేస్తే బాగుంటుందని రాజ్‌భవన్ వర్గాలు... సీఎంవో దృష్టికి తీసుకెళ్లడంతో... శ్రావణ్‌కుమార్‌తో రాజీనామా చేయించారని తెలుస్తోంది. కాగా, విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మావోయిస్టుల చేతిలో హత్యకు గురికావడంతో.. ఆయన కుమారుడు కిడారి శ్రావణ్‌ కుమార్‌ను సీఎం చంద్రబాబు మంత్రిని చేసిన సంగతి తెలిసిందే. ఇక తన రాజీనామాకు ముందు సీఎం చంద్రబాబు అందుబాటులో లేకపోవడంతో.. మంత్రి నారా లోకేష్‌ని కలిసి రాజీనామా వ్యవహారంపై చర్చించారు కిడారి శ్రావణ్‌ కుమార్.