10లోపు మంత్రి పదవికి రాజీనామా..!

10లోపు మంత్రి పదవికి రాజీనామా..!

విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మావోయిస్టుల చేతిలో హత్యకు గురికావడంతో.. ఆయన కుమారుడు కిడారి శ్రావణ్‌ కుమార్‌ను మంత్రిని చేసిన సీఎం చంద్రబాబు.. ఆయనకు రాష్ట్ర వైద్య, గిరిజన సంక్షేమ శాఖలు అప్పగించారు. అయితే, ఇప్పుడు కిడారి శ్రావణ్‌ కుమార్‌ రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రాజ్యాంగ నియమావళి ప్రకారం మంత్రిగా ప్రమాణస్వీకారం చేసినవాళ్లు.. ఆరు నెలల్లోగా చట్టసభకు ఎన్నిక కావాలి. గతేడాది నవంబర్‌ 11వ తేదీన చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రావణ్‌కు ఆరునెలల వ్యవధి ఈ నెల 10వ తేదీతో ముగియనుంది. రాజ్యాంగ ప్రకారం ఆయన 11వ తేదీ నుంచి మంత్రిగా కొనసాగడానికి అవకాశం లేదు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలు జరిగినా... ఫలితాలు ఈ నెల 23వ తేదీన రానున్నాయి. ఈ ఎన్నికల్లో శ్రావణ్‌ గెలిచి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి మరికొంత సమయం పట్టనుంది. దీంతో అప్రమత్తమైన రాజ్‌భవన్‌.. ఓ మంత్రి చట్ట సభల సభ్యుడు కాలేకపోయి మంత్రి పదవి కోల్పోవడం అవమానకరంగా ఉంటుందని గవర్నర్ నరసింహన్... ఈ నెల 10వ తేదీలోపే శ్రావణ్‌తో రాజీనామా చేయించాలని సీఎం చంద్రబాబుకు సూచించినట్టు సమాచారం. మొత్తానికి 29 ఇయర్స్ యంగ్ మినిస్టర్ తన మంత్రి పదవిని మధ్యంతరంగా కోల్పోవాల్సిన పరిస్థితి విచ్చింది.