ఐపీఎల్‌... పంజాబ్‌ హ్యాట్రిక్

ఐపీఎల్‌... పంజాబ్‌ హ్యాట్రిక్

ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌ ఎలెవన్‌ హ్యాట్రిక్‌ విక్టరీ కొట్టింది. 165 రన్స్‌ టార్గెట్‌తో బరిలో దిగిన కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌.. ఆరంభంలో తడబడింది. తొలి ఓవర్లో భారీ సిక్సర్‌ కొట్టిన  కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌..  జట్టు స్కోరు 17 వద్ద ఔటయ్యాడు. అయితే క్రీజులోకి వచ్చిన క్రిస్‌గేల్‌.. ఐదో ఓవర్‌లో వీరవిహారం చేశాడు. రెండు సిక్సులు, మూడు ఫోర్లు బాదేశాడు. ఆ తర్వాతి ఓవర్లోనే గేల్‌ను అశ్విన్‌ క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. ఆ వెంటనే మయాంక్‌ కూడా రనౌటయ్యాడు. 56 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన పంజాబ్‌ను.. పూరన్‌, మాక్స్‌ వెల్‌ ఆదుకున్నారు. వీరిద్దరూ ధాటిగా ఆడుతూ.. స్కోరు బోర్డును పరిగెత్తించారు. అద్భుతమైన బౌండరీలు.. కళ్లు చెదిరే సిక్సర్లతో చెలరేగాడు పూరన్. దాంతో పంజాబ్‌ స్కోరు 10 ఓవర్లకే సెంచరీ దాటేసింది. హాఫ్‌ సెంచరీ చేశాక పూరన్‌ అవుటైనా.. మాక్స్‌వెల్‌, హుడా, నీషమ్‌.. జట్టుకు విజయాన్ని అందించారు.

అంతకు ముందు గబ్బర్‌.. మళ్లీ గర్జించాడు. ఐపీఎల్‌ చరిత్రలో వరుసగా రెండు సెంచరీలు బాదిన ఏకైక ఆటగాడిగా రికార్డు సాధించాడు. వరుస బౌండరీలు, భారీ సిక్సర్లతో దుమ్మురేపాడు. 61 బంతుల్లోనే 12 బౌండరీలు, 3 సిక్సర్ల సాయంతో 106 పరుగులతో అజేయంగా నిలిచాడు శిఖర్‌ ధావన్‌. ఒక ఎండ్‌లో ధావన్‌ రెచ్చిపోతున్నా.. మిగతా ఢిల్లీ బ్యాట్స్‌మెన్ ఫెయిలయ్యారు. శ్రేయస్, రిషభ్ పంత్‌, స్టాయినిస్‌ విఫలమయ్యారు. పంజాబ్‌ బౌలర్లు విజృంభించడంతో ఢిల్లీ స్కోరు వేగం తగ్గింది. శ్రేయస్‌ సేన.. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులే చేయగలిగింది. ఈ సీజన్‌లో పంజాబ్‌కు ఇది వరుసగా మూడో విక్టరీ. 8 పాయింట్లతో పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది.