కింజరాపు కుటుంబం నుంచి ముగ్గురు విజయం

కింజరాపు కుటుంబం నుంచి ముగ్గురు విజయం

జగన్ ప్రభంజనం ఆంధ్రప్రదేశ్‌ లో సరికొత్త రాజకీయ విప్లవం సృష్టించింది. రికార్డుస్ధాయి విజయంతో వైసీపీ నవ శకానికి నాంది పలికింది. టీడీపీ ఆవిర్భావం అనంతరం ఎన్నడూ లేని రీతిలో కేవలం 20 అసెంబ్లీ స్థానాకే పరిమితమై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 19 మంది మంత్రులు, స్పీకర్, చీఫ్ విప్, విప్ లతో సహా ఆ పార్టీ అతిరథ మహారథులు ఓటమి పాలయ్యారు. అయితే ఫ్యాన్ గాలిని దీటుగా ఎదుర్కొని కింజరాపు కుటుంబం నుంచి పోటీ చేసిన ముగ్గురు విజయం సాధించారు. దివంగత నేత ఎర్రన్నాయుడు సోదరుడు అచ్చెన్నాయుడు, కుమారుడు రామ్మోహన్‌ నాయుడు, కుమార్తె భవానీ ఈ ఎన్నికల్లో గెలుపొందారు.

విజేతగా నిలిపిన చివరి రౌండ్ 
శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మంత్రి అచ్చెన్నాయుడు రెండోసారి గెలుపొందారు. సమీప ప్రత్యర్థి, వైసీపీకి చెందిన పేరాడ తిలక్‌పై 8,857 ఓట్ల ఆధిక్యంతో ఆయన విజయం సాధించారు. తొలి రౌండ్లలో వైసీపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉండటంతో అచ్చెన్న గెలుపుపై అనుమానాలు ఏర్పడినా చివరి రౌండ్లలో వచ్చిన ఓట్లతో ఆయన మంచి విజయాన్ని నమోదు చేశారు. 

6,653 ఓట్ల మెజారిటీతో విజయం
ఎర్రన్నాయుడు తనయుడు రామ్మోహన్‌ నాయుడు శ్రీకాకుళం లోక్‌సభ స్థానం నుంచి రెండోసారి పోటీ చేసి విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌పై 6,653 ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందారు. ఆరంభం నుంచే ఇద్దరి మధ్య ఆధిక్యం మారుతూ వచ్చింది. చివరకు శుక్రవారం ఉదయం 6 గంటల తర్వాత టీడీపీ అభ్యర్థి రామ్మోహన్‌నాయుడే విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. 

పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే విజయం
రాజమహేంద్రవరం సిటీ అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ తరుపున పోటీ చేసిన ఎర్రన్నాయుడి కుమార్తె భవానీ భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే భవానీ గెలుపొందడం విశేషం. తొలినుంచీ ఆధిక్యంలోనే కొనసాగుతూ వచ్చిన ఆమె.. వైసీపీ అభ్యర్థి రౌతు సూర్యప్రకాశరావుపై 30,065 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు.