హస్తినపై రైతుల దండయాత్ర

హస్తినపై రైతుల దండయాత్ర

దేశ రాజధానిని రైతులు దిగ్భందించారు. ఢిల్లీ శివారుల్లో దాదాపు 70 వేల మంది డిమాండ్ల పరిష్కారం కోసం ధర్నాకు దిగారు. రుణమాఫీ, ఇంధన ధరల తగ్గింపు, స్వామి నాథన్ కమిషన్ సిఫారసులు, ఎన్సీఆర్ లో పదేళ్లు దాటిన ట్రాక్టర్ల వినియోగంపై విధించిన నిషేదం ఎత్తివేత తదితర డిమాండ్ల పరిష్కరించాలని కోరుతూ రోడ్డెక్కారు. భారతీయ కిసాన్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన కిసాన్ క్రాంతి యాత్ర ఉద్రిక్తతకు దారితీసింది. పాదయాత్రగా బయల్దేరిన రైతులు ఢిల్లీలోని చౌధురి చరణ్ సింగ్ స్మారకం కిసాన్ ఘాట్ వరకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఢిల్లీలోకి వచ్చే దారులకు అడ్డంగా బారికేడ్లను పోలీసులు ఏర్పాటు చేశారు. దీంతో వారితో ఘర్షణకు దిగారు. పరిస్థితి అదుపు తప్పడంతో లాఠీచార్జ్ చేశారు. వాటర్ కెనన్, బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. పరిస్థితి చేజారడంతో కేంద్రం రైతులను శాంతింపచేసేందుకు సకల ప్రయత్నాలను చేసింది. హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ అధికారులతో చర్చలు జరిపారు. మొత్తం 11 డిమాండ్లలో ఏడింటిని పరిష్కరిస్తామని తెలిపారు. రైతుల సమస్యల పరిష్కారానికి ఆరుగురు ముఖ్యమంత్రులతో ఓ కమిటి వేస్తున్నట్లు కూడా ప్రకటించారు.

స్వామినాథన్ సిఫారసులను అమలు చేయాలి
రైతులు ప్రధానంగా ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలుచేయాలని డిమాండ్ చేస్తున్నారు. పంటలకు సహేతుకమైన కనీస మద్దతు ధరను ఇవ్వాలని, చిన్న రైతులకు భద్రత కల్పించాలని స్వామినాథన్ సిఫారసు చేశారు. సీలింగ్, అదనపు, బీడు భూములను రైతులకు పంచాలని.. వ్యవసాయేతర పనులకు సాగు భూములను వినియోగించరాదని, గిరిజనులకు అడవుల్లో పశువులను మేపుకొనే హక్కులివ్వాలని స్వామినాథన్ ప్రధానంగా సూచించారు. నీటిపారుదల వనరులను సంస్కరించి రైతులకు పంచాలని, పంట రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించాలని, రుణ వసూళ్లపై మారటోరియం విధించాలని, మహిళా రైతులకు ప్రత్యేక కిసాన్ క్రెడిట్ కార్డు సదుపాయం కల్పించాలని ఆ కమిషన్ సిఫారసు చేసింది.