రెండో రాజధానిగా హైదరాబాద్...కిషన్ రెడ్డి క్లారిటీ !

రెండో రాజధానిగా హైదరాబాద్...కిషన్ రెడ్డి క్లారిటీ !


హైదరాబాద్ రెండో రాజధానంటూ వస్తున్న పుకార్లపై కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డి స్పందించారు. అసలు ఈ ప్రతిపాదన లేనే లేదని, దీనిపై కేంద్ర ప్రభుత్వంలో ఎలాంటి చర్చా జరగలేదని ఆయన స్పష్టం చేశారు. రేపటి నుంచి శీతాకాల పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సభ నిర్వహణపై చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.  తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని బీజేపీ, కాంగ్రెస్‌ హామీ ఇవ్వలేదని, విభజన చట్టం ప్రకారమే పోలవరానికి జాతీయ హోదా ఇచ్చామని అన్నారు. కాళేశ్వరానికి జాతీయ హోదా అంశాన్ని విభజన బిల్లులో సీఎం కేసీఆర్‌ ఎందుకు పెట్టించలేదని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. అంతేకాక ఆర్టీసీ సమ్మె విషయంలో సీఎం కేసీఆర్ వైఖరిని కిషన్ రెడ్డి తప్పుబట్టారు. కార్మికులపై కక్షసాధింపుతో వ్యవహరించడం సరికాదని హితవుపలికారు. ముఖ్యమంత్రి మొండివైఖరి విడనాడి ఆర్టీసీ జేఏసీ నేతలతో చర్చలు జరిపి సమస్య పరిష్కరించాలని ఆయన సూచించారు.