నేడు క్వాలిఫయర్‌-2.. చెన్నైతో ఎవరు?

నేడు క్వాలిఫయర్‌-2.. చెన్నైతో ఎవరు?

ఐపీఎల్‌-11 చివరి అంకానికి చేరిన విషయం తెలిసిందే. క్వాలిఫయర్‌-1లో ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై చెన్నై సూపర్‌ కింగ్స్‌ గెలిచి ఫైనల్ చేరింది. ఇక రెండో ఫైనల్‌ బెర్త్‌ ఎవరిదో ఇవాళ తేలనుంది. ఈ రోజు కలకత్తాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య సమరం జరగనుంది. ఈ  క్వాలిఫయర్‌-2లో గెలిచిన జట్టు ఆదివారం వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో ఫైనల్‌ ఆడుతుంది. 

లీగ్ మొదటిలో అద్భుత విజయాలతో పాంట్ల పట్టికలో మొదటి స్థానంలో చోటు దక్కించుకుంది సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌. అయితే చివరి ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు పరాజయాలు చవిచూసి క్వాలిఫయర్‌-2 నేడు ఆడనుంది. క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌ బ్యాటింగ్‌ లో విఫలమయింది హైదరాబాద్ జట్టు. టాప్ బ్యాట్స్ మెన్స్ ధావన్,  విలియమ్సన్‌ లు విఫలమవడంతో జట్టు స్కోర్ చేసేందుకు ఇబ్బంది పడింది. మనీశ్‌ పాండే, యూసుఫ్‌ పఠాన్‌ లు కూడా స్థాయి మేర ఆడలేకపోయారు. చివరలో బ్రాత్‌వైట్‌ ఆడకుంటే జట్టు స్కోరు వంద కూడా దాటేది కాదు. దీన్ని బట్టి కెప్టెన్ విలియమ్సన్‌పై జట్టు ఎంతగా ఆధారపడుతుందో తెలుస్తుంది. క్వాలిఫయర్‌-2లో కెప్టెన్ తో పాటు ఓపెనర్‌ ధావన్‌ కూడా చెలరేగాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత మనీశ్‌ పాండే, యూసుఫ్‌ పఠాన్‌, షకీబ్,బ్రాత్‌వైట్ లు తలో చేయి వేస్తే భారీ స్కోర్ సాధించే అవకాశం ఉంది. మరోవైపు లీగ్ మొదటి నుంచి హైదరాబాద్ కు బౌలేర్లే విజయాలను అందిస్తున్నారు. ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేసి సఫలం అయ్యారు. భువీ, కౌల్, రషీద్‌, సందీప్‌ సహా బౌలర్లంతా ఫామ్ లో ఉండటం హైదరాబాద్  జట్టుకు సాలిసొచ్చే అంశం. క్వాలిఫయర్‌-2లో బౌలర్లు చెలరేగితే.. కోల్‌కతాను ఓడించి ఫైనల్‌ చేరుకోవడం సులభమే.

గత ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు గెలుపులు. చివరి మ్యాచ్ ఎలిమినేటర్ లో రాజస్థాన్ పై అద్భుత విజయంతో క్వాలిఫయర్‌-2కు కోల్‌కతా నైట్‌రైడర్స్ చేరింది. ఇవాళ ఆడబోయేది సొంత మైదానం కాబట్టి కోల్‌కతాకు అన్ని కలిసొచ్చాయి. బ్యాటింగ్‌, బౌలింగ్ లలో సమతూకంగా ఉంది కోల్‌కతా జట్టు. ఓపెనర్‌ లిన్‌తో పాటు, నరైన్  అలవోకగా బౌండరీలు బాదటం.. ఆ తర్వాత నితీశ్‌ రాణా, ఉతప్ప మోస్తరుగా ఆడుతుండటం.. ఇక కెప్టెన్‌ దినేష్ కార్తీక్‌ చివరి వరకు నిలబడి అదరగొడుతున్నాడు. దీనికి తోడు రస్సెల్ హిట్టింగ్‌ కోల్‌కతాకు పెద్ద సానుకూల అంశం. ఇక బౌలింగ్‌లో నరైన్, కుల్దీప్, చావ్లాల స్పిన్‌ను ఆడటం హైదరాబాద్‌ బ్యాట్స్‌మెన్‌కు సవాలే. పేస్‌ విభాగంలో రస్సెల్, ప్రసిధ్, సియర్ల్స్‌లను భారీగా పరుగులు ఇస్తున్నా.. వికెట్లు తీస్తున్నారు. అయితే రెండు జట్లు బలంగానే కనిపిస్తున్న నేపథ్యంలో.. ఈ పోరులో ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి.

జట్లు(అంచనా):

హైదరాబాద్‌: విలియమ్సన్‌(కెప్టెన్‌), ధావన్, పాండే, పఠాన్, షకీబ్, గోస్వామి, బ్రాత్‌వైట్, భువనేశ్వర్, రషీద్‌, సిద్దార్థ్‌ కౌల్, సందీప్‌ శర్మ.

కోల్‌కతా: దినేశ్‌ కార్తీక్‌(కెప్టెన్‌), లిన్, నరైన్, ఉతప్ప, నితీశ్‌ రాణా, శుబ్‌మన్‌ గిల్, రసెల్, చావ్లా, కుల్దీప్, సియర్ల్స్, ప్రసిధ్‌.

Photo: FileShot