పేదలకు మేలు చేసే కార్యక్రమాన్ని అడ్డుకోవద్దు: కొడాలి నాని

పేదలకు మేలు చేసే కార్యక్రమాన్ని అడ్డుకోవద్దు: కొడాలి నాని

రేపటి నుంచి ఏపీలో ఇంటింటికీ రేషన్‌ బియ్యం పంపిణీ ప్రారంభం కానుంది. పంచాయతీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో పట్టణ ప్రాంతాలకే డోర్ డెలివరీ విధానం పరిమితం కానున్నట్టు చెబుతున్నారు.  ఈ అంశం మీద కొడాలి నాని మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల అమల్లో రాష్ట్ర ప్రభుత్వం పారదర్శక విధానాలను అమలు చేస్తోందని అన్నారు. కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడకుండా అర్హతే ప్రామాణికంగా అందిస్తుందని, ఈ క్రమంలోనే ఇంటింటికీ రేషన్‌ బియ్యాన్ని ప్రవేశ పెట్టిందని అన్నారు. పైలెట్‌ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లాలో ఇంటింటికీ రేషన్‌ బియ్యాన్ని ప్రభుత్వం అమలు చేసి, అందులో ఉన్న లోటుపాట్లును పరిగణలోకి తీసుకుని ఈ మొబైల్‌ వాహనాలను తీసుకురావాలని నిశ్చియించిందని అన్నారు.

పాలీ ప్రొఫలీన్‌ సంచులు కారణంగా పర్యావరణానికి జరుగుతున్న ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంటింటికీ రేషన్‌ బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులు అందించడానికి ఈ మొబైల్‌ వాహనాల వ్యవస్ధను అందుబాటులోకి తీసుకొచ్చిందని ఆయన అన్నారు. అయితే రాష్ట్ర ఎన్నికల అధికారి పేదలకు ఎంతో అవసరమైన ఈ పథకం  ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధమని, దాన్ని నిలిపివేయాలని  ఈ నెల 28న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారని ఈ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ  రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించిందని అన్నారు. 

ప్రజలకు అవసరమైన సేవలను, నిత్యావసరవస్తువుల పంపిణీని విస్మరించడం సరికాదని కోర్టు స్పష్టంగా చెప్పిందని  ప్రభుత్వం దీనిపై రెండు రోజులలోగా తిరిగి ఎన్నికల సంఘాన్ని కోరాలని, ఐదు రోజులలోగా దీనికి  సంబంధించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశించడం హర్షణీయం అని అన్నారు. ప్రతి అంశాన్నీ రాజకీయాలకు ముడి పెట్టే ఎస్‌ఈసీ వైఖరి వల్ల  పేదల ఇంటికి బియ్యాన్ని, నిత్యావసర వస్తువులను చేర్చాలన్న ప్రభుత్వ ఆశయానికి అడ్డంకులు ఏర్పడ్డాయని ఆయన అన్నారు. ఈ నేపధ్యంలో అర్భన్‌ ప్రాంతాల్లో రాజకీయ నేతలెవరూ లేకుండానే రేపు ఇంటింటికీ రేషన్‌ బియ్యాన్ని మొబైల్‌ వాహనాల ద్వారా అందిస్తారని ఆయన అన్నారు. హైకోర్టు ఆదేశాల నేపధ్యంలో ఎన్నికల సంఘం నిర్ణయం వచ్చిన తర్వాతే గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ బియ్యం పంపిణీ  పథకం ప్రారంభమవుతుందని అన్నారు.