కోహ్లీ ఖాతాలో మరో రికార్డు..

కోహ్లీ ఖాతాలో మరో రికార్డు..

టీ20లు, వన్డేలు, టెస్టులు..  ఫార్మేట్‌ ఏదైనా చెలరేగిపోయే టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఖాతాలో లెక్కలేనన్ని రికార్డులున్నాయి. బ్యాటింగ్‌లోనే కాకుండా కెప్టెన్సీలోనూ అనేక రికార్డులను తిరగరాశాడు. ఇప్పుడు కోహ్లీ ఖాతాలోకి మరో రికార్డు వచ్చి చేరింది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇవాళ బరిలోకి దిగిన కోహ్లీ.. 6000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. అతి తక్కువ ఇన్నింగ్స్‌(119)ల్లో 6000 పరుగులు చేసిన రెండో భారతీయ క్రికెటర్‌గా రికార్డు సృష్టించిన కోహ్లీ.. సచిన్‌ (120ఇన్నింగ్స్‌ల) రికార్డును సైతం బద్దలు కొట్టాడు. ఇప్పటివరకూ 70 టెస్టు మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 119 ఇన్నింగ్స్‌ల్లో 54.61 సగటుతో 6వేల పైచిలుకు పరుగులు చేశాడు. ఇందులో 23 శతకాలు, 18 అర్ధ శతకాలు ఉన్నాయి. 

19 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్‌ తొలి సెషన్‌లోనే ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌(19) ధావన్‌(23) వికెట్లు కోల్పోయింది. ఇన్నింగ్స్ 8వ ఓవర్‌లో ఓపెనర్ కేఎల్ రాహుల్ (19) స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యుగా వికెట్ల ముందు దొరికిపోయాడు. మరో ఓపెనర్ ఓపెనర్ శిఖర్ ధావన్ (23) బ్రాడ్ బౌలింగ్‌లోనే కీపర్ జోస్ బట్లర్ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులో పుజారా (28), విరాట్‌ కోహ్లి(25) ఉన్నారు. లంచ్‌ విరామానికి 31 ఓవర్లలో భారత్‌ రెండు వికెట్లు నష్టపోయి 100 పరుగులు చేసింది. భారత్ ఇంకా 146 పరుగుల వెనుకంజలో ఉంది.