ప్లేఆఫ్స్‌కు చేరువలో నైట్‌రైడర్స్‌..

ప్లేఆఫ్స్‌కు చేరువలో నైట్‌రైడర్స్‌..

పీఎలలో రాజస్థాన్‌ రాయల్స్‌పై విజయం సాధించి ప్లేఆఫ్‌ ఆశల్ని  కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సజీవంగా ఉంచుకుంది. ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసి కోల్‌కతా శభాష్‌ అనిపించుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌.. కోల్‌కతా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (4/20) ధాటికి విలవిలలాడింది. ఓపెనర్లు జోస్ బట్లర్, రాహుల్ త్రిపాఠి ధాటిగా ఇన్నింగ్స్‌ ప్రారంభించినా.. కోల్‌కతా బౌలర్లు రాజస్థాన్‌ జోరుకి కళ్లెం వేశారు. బట్లర్‌, త్రిపాఠి, రహానె (11), శాంసన్ (12), స్టువర్ట్ బిన్నీ (1), బెన్‌స్టోక్స్ (11), గౌతమ్ (3)‌ స్వల్ప స్కోర్లకే వెనుదిరగడంతో 03/6తో రాజస్థాన్ ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో ఉనద్కత్ (26: 18 బంతుల్లో 3x4, 1x6) వేగంగా పరుగులు రాబట్టాడు.  19వ ఓవర్లో ఉనద్కత్‌ అవుటవడంతో రాజస్థాన్‌ 142 పరుగులకు ఆలౌటైంది. 143 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన కోల్‌కతా.. 12 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఓపెనర్ క్రిస్‌లిన్ (45: 42 బంతుల్లో 5x4, 1x6), కెప్టెన్ దినేశ్ కార్తీక్ (41 నాటౌట్: 31 బంతుల్లో 5x4, 1x6) సమయోచితంగా రాణించి 6 వికెట్ల తేడాతే జట్టుకు విజయాన్ని అందించారు. ఓపెనర్ సునీల్ నరైన్ (21: 7 బంతుల్లో 2x4, 2x6) తొలి ఓవర్‌లోనే 21 పరుగులు రబాట్టగా.. ఆ తర్వాత నితీశ్ రాణా (21: 17 బంతుల్లో 2x4, 1x6) ఫర్వాలేదనిపించాడు. చివర్లో క్రిస్‌లిన్ ఔటైనా.. రసెల్ (11 నాటౌట్: 5 బంతుల్లో 2x4)తో కలిసి.. కార్తీక్ సిక్స్‌తో గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో కోల్‌కతా మూడో స్థానాన్ని నిలబెట్టుకుంది.