ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ జోరుకు బ్రేకులు..

ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ జోరుకు బ్రేకులు..

ఐపీఎల్‌ 13వ సీజన్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తోన్న రాజస్థాన్‌ రాయల్స్‌ జోరుకు అడ్డుకట్ట పడింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో సంచలన ప్రదర్శన చేసిన రాజస్థాన్‌ మూడో మ్యాచ్‌ లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ చేతిలో 37 పరుగుల తేడాతో  ఓడిపోయింది. లక్ష్య ఛేదనలో టపటపా వికెట్లు కోల్పోయి చేతులెత్తేసింది. 
హ్యాట్రిక్‌ విక్టరీ సాధించాలనుకున్న రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టుకు.. నిరాశే ఎదురైంది. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టుకు టాస్ గెలిచినా... గేమ్‌లో మాత్రం ఓటమి తప్పలేదు. కోల్‌కతా నిర్దేశించిన 175 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన  రాజస్థాన్‌.. 20  ఓవర్లలో 9 వికెట్లకు 137 పరుగులే చేసింది. బ్యాటింగ్‌ వైఫల్యంతో  స్టీవ్‌ స్మిత్‌సేన ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 54 పరుగులు చేసిన టామ్‌ కరన్‌ ఒక్కడే పర్వా లేదనిపించాడు. మిగితావారు చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. 

లక్ష్య ఛేదనకు దిగిన రాజస్థాన్‌ బ్యాట్స్‌మెన్‌.. కోల్‌కతా యువ బౌలర్ల ధాటికి విలవిల్లాడిపోయారు. వరుస ఓవర్లలో టపటపా వికెట్లు ఇచ్చుకున్నారు. దీంతో రాజస్థాన్‌ స్కోర్‌ 100 దాటడం కూడా కష్టమే అనుకున్నారు. కోల్‌కతా బౌలర్లలో   శివమ్‌ మావి రెండు, కమ్లేశ్‌ నాగర్‌కోటి 2, వరుణ్‌  చక్రవర్తి 2 వికెట్లు తీశారు. అంతకు ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ నిర్ణీత  20 ఓవర్లలో 6 వికెట్లకు 174 పరుగులు చేసింది. యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ 47 పరుగులతో శుభారంభం ఇవ్వగా.. ఆఖర్లో ఇయాన్‌ మోర్గాన్‌ 34 పరుగులు చేసి.. జట్టుకు పోరాడే స్కోరు అందించాడు. స్టార్‌ ఆల్‌రౌండర్‌  జోఫ్రా ఆర్చర్‌.. కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. తర్వాత ఇన్నింగ్స్‌ మొదలెట్టిన రాజస్థాన్‌.. ఆరంభం నుంచి వికెట్లు కోల్పోయింది. కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ మూడు పరుగులు చేసి ఔటవగా.. సంజూ శాంసన్‌ కూడా నిరాశపర్చాడు. జోస్‌ బట్లర్‌, రాబిన్‌ ఉతప్ప కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసినా.. ఫలితం దక్కలేదు. ఆఖర్లో కరన్‌ అర్ధశతకం చేసి.. ఓటమి అంతరాన్ని తగ్గించాడు.