మహమ్మద్ షమీపై కోల్ కతా పోలీసుల ఛార్జిషీట్

మహమ్మద్ షమీపై కోల్ కతా పోలీసుల ఛార్జిషీట్

టీమిండియా ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమీ కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. ఆయనపై వరకట్నం వేధింపులు, లైంగిక వేధింపుల కేసుల్లో కోల్ కతా పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. షమీపై ఐపీసీ సెక్షన్ 498ఏ కింద వరకట్న వేధింపులు, సెక్షన్ 354ఏ కింద లైంగిక వేధింపుల కేసుల్లో ఈ ఛార్జిషీట్లు ఫైలయ్యాయి. కోల్ కతా పోలీసులు షమీ భార్య హసీన్ జహాన్ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ దర్యాప్తు జరిపిన ఏడాది తర్వాత ఈ ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఇంతకు ముందు గత ఏడాది భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత హసీన్ జహాన్ షమీకి ఎందరో మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని ఆరోపించింది.

కొన్ని నెలలుగా భారత జట్టులో ఆడుతున్న షమీ అద్భుత ప్రదర్శనలతో అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. టెస్టుల్లో తన మంచి ప్రదర్శనతో వన్డే జట్టులో స్థానం సంపాదించ గలిగాడు. వన్డేల్లోనూ బాగా రాణిస్తున్న షమీకి ఇంగ్లాండ్ లో జరగబోయే ఐసీసీ వరల్డ్ కప్ లోనూ చోటు ఖాయమని అంతా భావిస్తున్నారు. ప్రపంచ కప్ కి ముందు షమీ ఐపీఎల్ ఆడాల్సి ఉంది. ఈ సమయంలో మరోసారి అతనిపై ఛార్జిషీట్ దాఖలు కావడంతో షమీ ఈ సీజన్ 
ఐపీఎల్ లో ఆడటం అనుమానంగా కనిపిస్తోంది. ఈ కారణంగానే అతను వరల్డ్ కప్ లో ఆడటం ప్రమాదంలో పడేలా ఉంది.

గత ఐపీఎల్ సీజన్ కి ముందు షమీ, అతని భార్యకి సంబంధాలు చెడిన వార్తలు ప్రపంచానికి తెలిశాయి. దీంతో షమీ ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఐపీఎల్ లో కూడా అతను ఎక్కువ మ్యాచ్ లు ఆడలేకపోయాడు. బీసీసీఐ కూడా అతనిపై బ్యాన్ విధించింది. కానీ షమీ వీటన్నిటి నుంచి ఎలాంటి మచ్చ లేకుండా బయటపడి టీమిండియాలోకి వచ్చాడు. అయితే అతని భార్య మాత్రం మరిన్ని ఇబ్బందులు సృష్టించేందుకు ప్రయత్నించింది. గత ఏడాది షమీ తనను వరకట్నం కోసం వేధించాడని, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడని అతని భార్య హసీన్ జహాన్ ఎన్నో దారుణమైన ఆరోపణలు చేసింది. దర్యాప్తు జరిపిన తర్వాత షమీ మ్యాచ్ ఫిక్సింగ్ కి పాల్పడలేదని బీసీసీఐ అతనికి క్లీన్ చిట్ ఇచ్చింది.