పంజాబ్‌పై కోల్‌కతా విజయం

పంజాబ్‌పై కోల్‌కతా విజయం

ఐపీఎల్-11లో భాగంగా హోల్కార్ స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా విజయం సాధించింది. 31  పరుగుల తేడాతో పంజాబ్‌పై కోల్‌కతా జయకేతనం ఎగురవేసింది. 246 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. రస్సెల్ ఒకే ఓవర్‌లో గేల్(21), మయాంక అగర్వాల్(0).. ఆ తర్వాతి ఓవర్లో కరుణ్ నాయర్(3) లను పెవిలియన్ కి పంపాడు. కీలక వికెట్లు కోల్పోవడంతో పంజాబ్  కష్టాల్లో పడింది. ఈ దశలో ఓపెనర్ లోకేష్ రాహుల్ రెచ్చిపోయాడు. ధాటిగా ఆడే క్రమంలో రాహుల్(66) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. జట్టుని ఫించ్ ఆదుకునే ప్రయత్నం చేసాడు. అక్సర్ పటేల్(19)తో కలిసి స్కోర్ బోర్డును ముందుకు నడిపాడు. కొద్దిసమయానికి ఫించ్(34) ఔట్ అయ్యాడు.

ఈ పరిస్థితిలో కెప్టెన్ అశ్విన్(45; 22 బంతుల్లో 4  ఫోర్లు, 3 సిక్సులు)వేగంగా ఆడినా.. రన్ రేట్ పెరిగిపోవడంతో భారీ షాట్ కి ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. చివరలో బౌలర్లు ఉండటంతో.. స్కోర్ చేయలేకపోయారు. దీంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనమిది వికెట్లు నష్టానికి 214 పరుగులు చేసింది. కోల్‌కతా బౌలర్లలో రస్సెల్ మూడు వికెట్లు తీసాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 245 పరుగుల భారీ స్కోర్ చేసింది. కోల్‌కతా బ్యాట్స్ మెన్స్ సునీల్ నరైన్ (75), కెప్టెన్ దినేష్ కార్తీక్(50), రస్సెల్‌(31)లు బౌండరీలు, సిక్సులతో విరుచుకుపడటంతో భారీ స్కోర్ చేసింది.