ఓ నిర్ణయానికి వచ్చిన కోమటిరెడ్డి..!?

ఓ నిర్ణయానికి వచ్చిన కోమటిరెడ్డి..!?

తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో మునుగోడు శాసనసభ స్థానం నుంచి విజయం సాధించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి... బీజేపీలో చేరికపై గత కొంతకాలంగా తీవ్రమైన చర్చ సాగుతోంది. ఆయన ప్రధాని మోడీ, బీజేపీ నేతలకు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడంపై తీవ్ర దుమారమే రేగింది. మళ్లీ ఆయన యూటర్న్ తీసుకుని కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతానని ప్రకటించారు. అయితే, కోమటిరెడ్డి వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్... ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని.. లేని పక్షంలో వేటు తప్పదని హెచ్చరించింది. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి... బీజేపీలో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. బుధవారం అర్ధరాత్రి వరకు తన ముఖ్య అనుచరులతో సమావేశమై సుదీర్ఘ చర్చలు జరిపిన కోమటిరెడ్డి... చివరకు కమలం గూటికి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక దీనిపై కార్యకర్తల అభిప్రాయాలను కూడా తీసుకోవడానికి ఆయన సిద్ధమయ్యారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ పెద్దఅంబర్ పేటలో మునుగోడు నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశం తర్వాత ఆయన బీజేపీలో చేరికపై అధికారికంగా ప్రటన చేసే అవకాశం ఉందంటున్నారు. కాగా, సార్వత్రిక ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ స్థానం నుంచి విజయం సాధించిన ఆయన సోదరుడు, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి... తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేసిన సంగతి తెలసిందే.