'చిరుమర్తిని ఆ దేవుడు కూడా క్షమించడు..'

'చిరుమర్తిని ఆ దేవుడు కూడా క్షమించడు..'

పార్టీ మారేందుకు సిద్ధమైన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యపై మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి... నకిరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలతో నల్గొండ డీసీసీ అధ్యక్షులు శంకర్ నాయక్‌తో కలిసి సమావేశమైన ఆయన... ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చిరుమర్తి నమ్మక ద్రోహం చేశాడని మండిపడ్డారు. మాతో చెప్పకుండానే పార్టీ మార్పు పై నిర్ణయం తీసుకుని నమ్మకం, విశ్వాసం అనే పదాలకు విలువ లేకుండా చేశాడని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. అభివృద్ధి కోసం అనే డొంక తిరుగుడు మాటలు చెప్పి, నీ స్వార్థం కోసం మమ్మల్ని వంచించావ్ అని ఆవేదన వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్ నమ్మిన వారి కోసం ప్రాణం ఇస్తారని తెలంగాణ సమాజమంతా భావిస్తే.. ఆ నమ్మకానికే ద్రోహం చేశావ్.. నిన్ను ఆ దేవుడు కూడా క్షమించడు అని వ్యాఖ్యానించారు రాజగోపాల్‌రెడ్డి. నియోజకవర్గ కార్యకర్తలు ఎవరు అధైర్య పడవద్దు... ఒక్క చిరుమర్తి పోయినంత మాత్రాన ఏమికాదు... మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గాలను నారెండు కళ్లలాగా చూసుకుంటానంటూ ధైర్యాన్ని చెప్పారు.