కేసీఆర్‌ పతనం ఆ రోజు నుంచే: కోమటిరెడ్డి

కేసీఆర్‌ పతనం ఆ రోజు నుంచే: కోమటిరెడ్డి

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మళ్లీ బుద్ధి చెప్పబోతున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఇవాళ నల్గొండలో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు ఉండకూడదని కాంగ్రెస్‌ను టీఆర్ఎస్‌లో విలీనం చేస్తానన్న రోజునే కేసీఆర్‌ పతనం మొదలైందని అన్నారు. మాయ మాటలు చెప్పి రెండో సారి గెలిచిన కేసీఆర్‌.. సర్పంచ్‌లకు కనీసం చెక్‌ పవర్‌ కూడా ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయించి, ఆర్థిక సంక్షోభంలోకి నెట్టి రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా చేసిన ఘనత కేసీఆర్‌ కుటుంబానికే చెందుతుందన్నారు. ఇంటర్ పరీక్షలను సరిగా నిర్వహించలేని మంత్రి జగదీష్ రెడ్డి.. క్యాంపు రాజకీయాలను నిర్వహిస్తూ బీచ్‌లలో తిరుగుతున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌ను గద్దె దించేవరకు తమ ధర్మ యుద్ధం కొనసాగుతుందని స్పష్టం చేశారు.