కాంగ్రెస్ ఇంచార్జిపై సీనియర్ నేత అసహనం.!

కాంగ్రెస్ ఇంచార్జిపై సీనియర్ నేత అసహనం.!


ఆ ఇంఛార్జ్‌ మీద కాంగ్రెస్‌లో అంతా గుర్రుగానే ఉన్నారు. బాహాటంగానే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఒక ఎంపీ అయితే.. ఆయన నిర్వహించే మీటింగ్స్‌కు రాను అని చెప్పేశారట. ఇంతకీ ఎవరా ఇంఛార్జ్‌? పార్టీ ఎంపీకి ఉన్న అభ్యంతరాలేంటి? 

తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త పరిణామాలు!

తెలంగాణ కాంగ్రెస్‌లో ఇన్నాళ్లూ లోకల్ నాయకుల మధ్య వార్ జరిగేది. జిల్లాల నాయకులు... రాష్ట్ర నేతల మధ్య పెద్దగా పొసిగేది కాదు. ఇప్పుడు సీన్ రివర్స్‌ అయిందట. AICC రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్‌కి.. రాష్ట్రంలోని ముఖ్య నాయకుల మధ్య గ్యాప్ వచ్చేసింది. పీసీసీకి కొత్త చీఫ్‌ ఎంపిక తెచ్చిన తంటాతో ఠాగూర్‌కు, నాయకుల మధ్య పంచాయితీ మొదలైంది. ఈ విషయంలో మొదటి నుంచీ పార్టీ నాయకులు ఆయన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు. అప్పుడప్పుడు అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. పీసీసీ చీఫ్‌ రేసులో ఉన్న కొందరు కోపాన్ని కూడా పెంచుకున్నారట. పార్టీలో ఇలాంటి పరిస్థితి గతంలో ఉండేది కాదని టాక్‌. 

ఠాగూర్‌తో మీటింగ్‌కు డుమ్మా కొట్టిన ఎంపీ కోమటిరెడ్డి!

ఇటీవల రెండు రోజుల పర్యటన కోసం మాణిక్యం ఠాగూర్‌ హైదరాబాద్‌ వచ్చి వెళ్లారు. పార్టీ ముఖ్య నాయకులతోపాటు.. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే నియోజకవర్గాల పరిధిలోని నేతలతో ఆయన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా అధ్యక్షులతోనూ మాట్లాడారు ఠాగూర్‌. ఈ సమావేశాలకు నల్లగొండ జిల్లాకు చెందిన పార్టీ ముఖ్య నాయకుడు.. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డుమ్మా కొట్టారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్లగొండ జిల్లా కీలకం. అలాంటి జిల్లాకు చెందిన ఎంపీ రాకపోవడంతో పార్టీలో కలకలం రేగింది. 

ఠాగూర్‌ ఉన్నన్ని రోజులూ రానని చెప్పారా? 

ఇదే సమయంలో గాంధీభవన్‌ నుంచి ఓ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కాంటాక్ట్‌లోకి వెళ్లారట. ఆ సందర్భంగా ఠాగూర్‌ పెట్టే మీటింగ్స్‌ను నేను రాను అని చెప్పేశారట. ఇప్పుడే కాదు.. ఎప్పుడు రాను.. అతను ఉన్నన్ని రోజులు రాను అని కోమటిరెడ్డి చెప్పినట్టు సమాచారం. దీంతో కోమటిరెడ్డికి అంత కోపం ఎందుకొచ్చింది? అని పార్టీ వర్గాలు ఆరా తీస్తున్నాయి. 

సొంత అభిప్రాయాలు జోడించారని ఠాగూర్‌పై గుర్రు!

కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే రెండు పర్యాయలుగా పీసీసీ చీఫ్ రేసులో ఉంటూ వచ్చారు. NSUI నుంచి పార్టీలో ఉంటున్నారు. గతంలో తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేశానని గుర్తు చేస్తుంటారు. పార్టీ అధినేత సోనియగాంధీకి కూడా ఇదే విషయం చెప్పిన సందర్భాలు ఉన్నాయి. రాష్ట్రంలో పాదయాత్ర చేస్తానని.. కాంగ్రెస్‌లో అధికారంలోకి తీసుకొస్తానని చెబుతూ.. అనుమతి ఇవ్వాలని మేడమ్‌కు లేఖ రాశారు కోమటిరెడ్డి. ఢిల్లీ వెళ్లినప్పుడు రాహుల్‌, సోనియాగాంధీలను కలిసి ఇదే విషయాన్ని విన్నవించారు కూడా. ఇటీవల పీసీసీ చీఫ్‌ ఎంపిక కోసం  ఇంఛార్జ్‌ ఠాగూర్‌ చేపట్టిన అభిప్రాయ సేకరణ వన్‌సైడ్‌ జరిగిందన్నది కోమటిరెడ్డి ఆరోపణ. పార్టీకి విధేయులుగా ఉన్నవారు ఎవరు అన్నదానికంటే.. సొంత అభిప్రాయాలను జోడించారని ఠాగూర్‌పై గుర్రుగా ఉన్నారట. 

జాబితాలో పేరు పెట్టలేదని ఠాగూర్‌పై గరంగరం!

పీసీసీ చీఫ్ రేసులో ఉన్న వారి పేర్ల జాబితాను సోనియాగాంధీకి పంపినప్పుడు... దాంట్లో తన పేరు ఉద్దేశపూర్వకంగానే ప్రస్తావించలేదన్న కోపంలో ఉన్నారట కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆయన సోదరుడు, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇంఛార్జి వ్యవహార శైలితో కినుక వహించారు.  ఎన్నికలకు పార్టీ సమాయత్తం అవుతున్న సమయంలో వెలుగులోకి వస్తున్న ఇలాంటి పరిణామాలపై గాంధీభవన్‌ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోందట. మరి.. కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఏం చేస్తుందో చూడాలి.