ఒకటి, రెండు రోజుల్లో రాజకీయ నిర్ణయం..!

ఒకటి, రెండు రోజుల్లో రాజకీయ నిర్ణయం..!

కార్యకర్తలు, అభిమానుల కోరికపై ఎంపీగా పోటీచేస్తానని ప్రకటించారు మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ... అనకాపల్లిలోని రావుగోపాలరావు ఆడిటోరియంలో కార్యకర్తలు, అభిమానులతో సమావేశమైన ఆయన భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఒకటి ,రెండు రోజుల్లో నా రాజకీయ నిర్ణయం చెబుతానన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఎలాంటి భేషజాలకు పోకుండా పనిచేస్తానన్న కొణతాల.. అవసరమైతే ప్రజల కోసం ఒక మెట్టు దిగుతా అన్నారు. నా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన నాటి నుండి ప్రజా సమస్యలపై పోరాటమే నా జెండా, అజెండాగా ఉందన్న ఆయన.. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, ఏ పార్టీ లేకపోయినా ప్రజా సమస్యలపై పోరాటం చేశానని గుర్తుచేసుకున్నారు. నా రాజకీయ జీవితంలో ఓటమి, గెలుపులను కూడా చూశానని.. ఏ పార్టీలో లేకపోయినా ఉత్తరాంధ్ర చర్చా వేదిక ద్వారా జటిలమైన సమస్యలను పరిష్కరించ గలిగానని సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ప్రాజెక్టుల్లో కొన్నింటిని పూర్తి చేయడం ద్వారా ప్రస్తుత సీఎం చంద్రబాబు నీరు ఇవ్వగలుగుతున్నారన్నారు కొణతాల... స్వలాభం లేకుండా చిత్తశుద్ధితో పని చేయడం వల్లనే నేను విజయాలు, మీ అభిమానం సంపాదించుకున్నానని వెల్లడించారు. కాగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలనే ఆయన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్ వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని కలవనున్న ఆయన... వైసీపీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది.