నాపై దుష్ప్రచారం..

నాపై దుష్ప్రచారం..

తనపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు చేవెళ్ల లోక్‌సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ సీఈవో రజత్‌కుమార్‌ను కలిసి ఫిర్యాదు చేసిన ఆయన... ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... తనకు సంబంధించిన వ్యక్తి దగ్గర రూ.10లక్షలు దొరికాయంటూ బురద జల్లుతున్నారని మండిపడ్డారు. తాను భారీ మెజార్టీతో గెలుస్తాననే భయంతో ఇలాంటివి చేస్తున్నారని విమర్శించారు. తన నియోజకవర్గంలో పరిధిలోని కింది స్థాయి క్యాడర్‌ను కొన్నారని తెలిపారు. తనపై చేస్తున్న దుష్ప్రచారంపై సీఈవోకి ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. సీఈవోను కలిసిన వారిలో కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ కూడా ఉన్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి గెలుపు ఖాయంమని ధీమా వ్యక్తం చేశారు. కొండాకు సంబంధించిన వ్యక్తి దగ్గర రూ. 10 లక్షలు దొరికితే రూ.10 కోట్లని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవి పది కోట్లని నిరూపిస్తే మేం ముక్కు నేలకు రాస్తామని సవాల్ చేశారు.