కన్నడ నవల ఆధారంగా క్రిష్ సినిమా

కన్నడ నవల ఆధారంగా క్రిష్ సినిమా
గమ్యం, వేదం వంటి వైవిధ్యభరితమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన క్రిష్ చారిత్రాత్మక చిత్రాలను తెరకెక్కించే పనిలో పడ్డాడు.  బాలకృష్ణతో గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా తరువాత క్రిష్ ఆలోచనలు ఒక్కసారిగా మారిపోయాయి.  చారిత్రాత్మక కథలను ఎంచుకొని సినిమాలు చేస్తున్నాడు.  
 
బ్రిటిష్ సామ్రాజ్యంపై అలుపెరుగని పోరాటం చేసిన ఝాన్సీ రాణి ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత చరిత్రను ఆధారం చేసుకొని మణికర్ణిక చిత్రాన్ని తీస్తున్నాడు.  ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది.  బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఇందులో మెయిల్ రోల్ చేస్తున్నది.  మణికర్ణిక చేస్తుండగానే బాలకృష్ణ నిర్మిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ కు దర్శకత్వం వహించాలని సిఫార్సు వచ్చినా మణికర్ణిక సినిమా బిజీ కారణంగా ఆ అవకాశాన్ని పక్కన పెట్టాడు.  కాగా, మణికర్ణిక తరువాత క్రిష్ ఏ జానర్ లో సినిమా చేయబోతున్నాడో అని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 
 
తనకు కలిసి వచ్చిన జానర్లోనే అంటే చారిత్రాత్మక కథతోనే సినిమా చేస్తాడట క్రిష్.  కన్నడ రచయిత బైరప్ప  రాసిన నవల పర్వ ఆధారంగా సినిమా చేయబోతున్నాడట. మహాభారతంలోని పలు పాత్రలను ఆధారం చేసుకొని రచయిత పర్వ నవలను రాశారు.  ఇందులో పలు వివాదాస్పదమైన అంశాలు ఉన్నాయట.  మరి క్రిష్ ఈ వివాదాస్పదమైన నవలను ఎందుకు ఎంచుకున్నట్టు.  వివాదాలకు తావు లేకుండా క్రిష్ సినిమాను రూపొందిస్తాడా.. చూద్దాం.