కృతి నోట తెలుగుమాట

కృతి నోట తెలుగుమాట

'1 నేనొక్కడినే'లో మహేశ్ తో కలసి సందడి చేసిన కృతిసనన్ ప్రస్తుతం ప్రభాస్ 'ఆదిపురుష్‌'లో సీతగా నటిస్తోంది. ఓంరౌత్ దర్శకత్వంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుందీ చిత్రం. ఈ చిత్రంలో ప్రభాస్ శ్రీరాముడిగా... సైఫ్ అలీఖాన్ రావణునిగా కనిపించనున్నారు. ఇక మరో బాలీవుడ్ నటుడు సన్నీసింగ్ లక్ష్మణుడిగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో తన పాత్రపోషణ కోసం కృతి తనను తాను ఎలా మలుచుకుంటోందో వెల్లడించారు దర్శకుడు ఓంరౌత్. కృతి ఈ సినిమాలో తన పాత్రకి తనే డబ్బింగ్ చెప్పుకోబోతోందట. తెలుగులో డబ్బింగ్ చెప్పటానికి వీలుగా... నిపుణుడైన కోచ్ ని నియమించుకుని తెలుగుభాషకు సంబంధించి శిక్షణ తీసుకోవడం మొదలెట్టిందట. అంతే కాదు సీత పాత్రలో ఫిట్ అవటానికి చాలా శ్రమిస్తోందట. నిత్యం వ్యాయామంతో పాటు స్లిమ్ లుక్ కోసం తిండి కూడా తగ్గించిందట. ప్రభాస్, సైఫ్‌ అలీఖాన్ కి దీటుగా నటించటానికి కృతి పడుతున్న కష్టం అంతా ఇంతా కాదట. 'ఆదిపురుష్‌' చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల చేయాలని యూనిట్ భావిస్తోంది. మరి కృతి పడుతున్న కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుందేమో చూడాలి.