గుర్తుపెట్టుకోండి: కవిత డాటర్‌ ఆఫ్‌ ఫైటర్‌..

గుర్తుపెట్టుకోండి: కవిత డాటర్‌ ఆఫ్‌ ఫైటర్‌..

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపోటములు ఎలా ఉన్నా నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో సిట్టింగ్ ఎంపీ, కేసీఆర్ కుమార్తె కవిత పరాజయం పాలవ్వడం చర్చగా మారింది. అయితే, కవిత ఓటమిపై మీడియా చిట్‌చాట్‌లో స్పందించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా మొదటి ఎన్నికల్లో ఓడిపోయారన్నారు. ఎన్నికల సమయంలో నిజామాబాద్‌లో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటి అయ్యాయని ఆరోపించిన ఆయన... నిజామాబాద్‌లో నామినేషన్లు వేసింది రైతులు కాదు... రాజకీయ నాయకులే అని విమర్శించారు. కానీ, కవిత డాటర్ ఆఫ్ ఫైటర్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్. ఇక బీజేపీకి కార్యకర్తలు లేనిచోట్ల కూడా ఓట్లు పడ్డాయని ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఆయన... అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన ఎన్నికలు ఈ లోకసభ ఎన్నికలు అని వ్యాఖ్యానించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో సాంకేతికంగా చేరలేదని చెప్పుకొచ్చారు కేటీఆర్.. ఆ 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు... టీఆర్ఎస్‌లో చేరాలని ఆసక్తి చూపారన్నారు. ఇక దేశంలో కాంగ్రెస్ దారుణమైన పరిస్థితిలో ఉందన్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. బీజేపీతో ప్రతిపక్ష పాత్ర పోషించేది ప్రాంతీయ పార్టీలేనని అభిప్రాయపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీతో రాజ్యాంగ బద్ధమైన సంబంధాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.