మోడీ, జగన్ లకి కేటీఆర్ శుభాకాంక్షలు

మోడీ, జగన్ లకి కేటీఆర్ శుభాకాంక్షలు

రెండోసారి ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న నరేంద్ర మోడీకి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్నికల్లో గెలిచిన మోడీ, జగన్, నవీన్ పట్నాయక్ లను ఆయన అభినందనలు తెలియజేశారు. మరోసారి టీఆర్ఎస్ కి మెజారిటీ కట్టబెట్టినందుకు తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో పార్టీని గెలిపించేందుకు బాగా శ్రమించిన టీఆర్ఎస్ కార్యకర్తలను అభినందించారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని, ఎవరికైనా అంతిమంగా ప్రజల తీర్పు శిరోధార్యమని అన్నారు. తాము మెరుగైన ఫలితాలను సాధిస్తామని భావించామని, ఓడినచోట్ల కారణాలను చర్చిస్తామని చెప్పారు. నిజామాబాద్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఓటమికి కారణాలను తెలుసుకుంటామని, అక్కడ కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కైనట్టు తెలిసిందన్నారు. కవితపై పోటీ చేసిన 180 మంది రాజకీయ కార్యకర్తలే తప్ప రైతులు కారని కేటీఆర్ ఆరోపించారు. భవిష్యత్తులో మరింత మెరుగైన పాలన అందించేందుకు ప్రయత్నిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. తమకు ఎవరితోనూ వ్యక్తిగత కక్షలు లేవని, పొరుగు వారితో మంచి సంబంధాలు నెరపాలన్నదే కేసీఆర్ విధానమని స్పష్టం చేశారు.