ఎక్కడ వేసిన గొంగడి అక్కడే..

ఎక్కడ వేసిన గొంగడి అక్కడే..

కాంగ్రెస్, బీజేపీ నేతలపై సెటైర్లు వేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్... హైదరాబాద్‌లోని బోరబండ, రాజీవ్ గాంధీ నగర్ గ్రౌండ్ లో ఎమ్మెల్యేలు మల్లా రెడ్డి, మాధవరం కృష్ణారావు, మల్కాజ్‌గిరి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన... ఈ సందర్భంగా మాట్లాడుతూ... దేశ రాజకీయ వ్యవస్థ ఎలా ఉందో అర్థం చేసుకోవాలని సూచించారు. ఎవరి దగ్గర కర్ర ఉంటే... వాళ్లే బర్రెని మలుపుకు పోయినట్టు ఉంది.. ఎవరికి ఎంపీ స్థానాలు ఎక్కువ ఉంటే... వాళ్ల రాష్ట్రాలే లాభపడ్డాయన్నారు. మనం 16 ఎంపీ లు గెలిస్తే... మన రాష్ట్రం మెరుపు వేగంతో అభివృద్ధి చెందుతున్న కేటీఆర్.. నరేంద్ర మోడీ వస్తే... ఏదో ఉద్ధరిస్తాడు అనుకున్నారు.. కానీ, చేసిందేమీలేదు.. నోట్లు రద్దు చేసి... మన పైసల కోసం మనమే బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ తిరిగే పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు. హైదరాబాద్ కోసం ఒక్క పని చేయని ఎన్డీఏ ప్రభుత్వం ఏం మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతోందని ఫైర్ అయ్యారు. మతాల మధ్య చిచ్చుపెట్టే మాటలు చెప్పే నేతలను తరిమి కొట్టాలని పిలుపునిచ్చిన కేటీఆర్... వచ్చే ఎన్నికల గురించి మేం ఆలోచించి మాట్లాడట్లేదు... వచ్చే తరాల కోసం ఆలోచిస్తున్నామని.. రాజశేఖర్ రెడ్డిని గొప్ప మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇక గరీబ్ హఠావో అంటారు... కానీ, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా పరిస్థితి ఉందని కాంగ్రెస్ నేతలపై సెటైర్లు వేశారు కేటీఆర్. అమ్మకి అన్నం పెట్టానోడు... పిన్నమ్మకి బంగారు గాజులు చేయిస్తాడా? అని ఎద్దేవా చేశారు. ఏళ్ల తరబడి అధికారంలో ఉండి ఏం చేయనివాళ్లకు ఇప్పుడు ఓట్లు అడగడానికి సిగ్గుండాలని మండిపడ్డారు.