'ఎక్కడైనా దొంగకే కేసు బదలాయిస్తారా..!?'

'ఎక్కడైనా దొంగకే కేసు బదలాయిస్తారా..!?'

ఐటీ గ్రిడ్స్ కేసు ఇప్పుడు తెలంగాణ, ఏపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుస్తోంది. ఐటీ గ్రిడ్స్ డేటా కేసు కాస్తా... ఏపీ వర్సెస్ తెలంగాణ సర్కార్‌గా మారిపోయింది. అయితే, దమ్ముంటే సీఎం చంద్రబాబు ఈ కేసును ఎదర్కోవాలని సవాల్ చేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్‌లో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. అడ్డంగా దొరికిపోయిన తర్వాత చంద్రబాబు, లోకేష్‌కు బుకాయింపు మాటలు ఎక్కువగా వస్తాయని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరకలేదా? అని ప్రశ్నించిన కేటీఆర్... ఏపీ పౌరుడు తెలంగాణలో ఫిర్యాదు చేస్తే, ఇక్కడే కేసు పెడతారని.. టీడీపీకి ఆ మాత్రం కూడా తెలియదా? అంటూ ఎద్దేవా చేశారు. ఐటీ గ్రిడ్స్‌పై కేసు నమోదైతే స్పందించడం తప్పా? ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తున్నారన్న ఫిర్యాదు వచ్చింది.. తమకు వచ్చిన ఫిర్యాదుపై తెలంగాణ పోలీసులు స్పందించారని క్లారిటీ ఇచ్చారు. అసలు ఈ కేసు విషయంలో ఏపీ పోలీసులకు తెలంగాణలో పనేంటి? అని ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్... చేసేందే తప్పు.. మళ్లీ మా ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారని మండిపడ్డారు. ఇక ఈ కేసును ఏపీకి బదిలీ చేయాలని మాట్లాడుతున్నారు... కేసు నమోదైందే వాళ్లపైన.. దొంగతనం చేసినోడి దగ్గరకే ఎక్కడానై కేసు బదలాయిస్తారా?.. దొంగనే ఎక్కడైనా కేసు విచారణ చేస్తారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దమ్ముంటే కేసును ఎదుర్కొండి.. కడిగిన ముత్యంలా బయటకు రండి ఎవరు వద్దన్నారు? అని వ్యాఖ్యానించారు కేటీఆర్. మరోవైపు సోషల్ మీడియాలో తెలంగాణ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు.. ఒకప్పుడు చంద్రబాబు నాటకాలు ప్రజల దగ్గర నడిచాయి.. కానీ, ఇప్పుడు సాగబోవన్నారు కేటీఆర్.