బిఎంటి విభాగాన్ని ప్రారంభించిన కేటీఆర్

బిఎంటి విభాగాన్ని ప్రారంభించిన కేటీఆర్

బసవతారకం ఇండో అమెరికన్‌ కేన్సర్‌ ఆసుపత్రిలో కాన్సర్ కు సంబందించిన లుకేమియా చికిత్స బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌ విభాగాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ... మహానీయుడు, గొప్ప వ్యక్తి తారకరామరావు పేరును నాకు పెట్టారు. అంత గొప్ప పేరును నిలబెట్టే విధంగానే పనులు చేస్తాను.. అంతే తప్ప చెడగొట్టే విధంగా పని చేయనన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ట్రస్టులకు ఆస్తి పన్నును రద్దు చేస్తున్నామని కేటీఆర్‌ ప్రకటించారు. పేద రోగులకు ఉపయోగపడేలా బసవతారకం ఆస్పత్రి ఓ సంస్థగా ఎదగడం అభినాదనీయకరం అని తెలిపారు. అమెరికా నుండి వచ్చిన తర్వాత.. బసవతారకం కేన్సర్‌ ఆస్పత్రి అభివృద్ధికి ఏదో ఒకటి చేయాలని మా అమ్మ నాతో చాలా సార్లు చెప్పింది. తెలంగాణ మంత్రిని అయిన తర్వాత కూడా ఈ విషయాన్ని అమ్మ పలుమార్లు గుర్తు చేసిందన్నారు కేటీఆర్‌. రోగుల వెంట వచ్చేవారికి రాత్రి పూట బసచేయడానికి సరైన సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతుండటం చూసి జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నైట్‌ షెల్టర్‌లు ఏర్పాటు చేశామన్నారు. మరిన్ని షెల్టర్ల ఏర్పాటు అవసరం ఉంది.. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. కేన్సర్‌పై అవగాహన కల్పించేందుకు నటసింహం బాలకృష్ణ కన్నా పెద్ద అంబాసిడర్‌ ఎవరు లేరని కేటీఆర్‌ అన్నారు.

హీరో బాలకృష్ణ మాట్లాడుతూ... బసవతారకం ట్రస్టుకు 6 కోట్ల ఆస్తి పన్నును జీహెచ్‌ఎంసీ రద్దు చేయడం చాలా సంతోషం అని అన్నారు. ఇదివరకు ముగ్గురు సీఎంలకు బసవతారకం ట్రస్టు ఆస్తిపన్ను రద్దు చేయాలని కోరితే స్పందించలేదు.. కానీ తెలంగాణ సీఎం కేసీఆర్‌ కోరిన వెంటనే ఆస్తి పన్నును రద్దుచేశారన్నారు. నేను చేస్తున్న ఎన్టీఆర్‌ బయోపిక్‌లో బసవతారకం ఇండో అమెరికన్‌ కేన్సర్‌ ఆసుపత్రి గురించి కూడా ఉందన్నారు బాలయ్య బాబు. 40పడకలతో ప్రారంభమైన ఆస్పత్రి ఇంతపెద్ద స్థాయికి చేరిందంటే.. వైద్యుల కృషి కారణం అని బాలయ్య తెలిపారు.