కేటీఆర్‌గారూ.. కేసీఆర్‌, వైఎస్‌లలో ఎవరు బెస్ట్‌?

కేటీఆర్‌గారూ.. కేసీఆర్‌, వైఎస్‌లలో ఎవరు బెస్ట్‌?

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే తెలంగాణ మంత్రి కేటీఆర్‌.. ట్విట్టర్‌లో తన ఫాలోవర్లతో ఇవాళ ముచ్చటించారు. ఆస్క్‌ కేటీఆర్‌ హ్యాష్‌ ట్యాగ్‌తో (#AskKTR) ఆయనను ట్యాగ్‌ చేస్తూ అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. మీకు నచ్చిన బీర్‌ ఏది? కేసీఆర్‌-వైఎస్సార్‌లో బెస్ట్‌ సీఎం ఎవరు? మీ ఫేవరెట్‌ ఫుట్‌బాల్‌ ఆటగాడెవరు? వంటి సరదా ప్రశ్నలతోపాటు రాష్ట్రాభివృద్ధి, ప్రభుత్వ పనితీరు వంటి సీరియస్‌ ప్రశ్నలకు కూడా కేటీఆర్‌ జవాబిచ్చారు.

 • డిసెంబర్‌లో సాధారణ ఎన్నికలు వస్తే ఎలా ఎదుర్కొంటారని అడగ్గా.. ఎన్నికలు డిసెంబర్‌లో వచ్చినా, వచ్చే ఏడాది వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
 • 2024 ఎన్నికల్లో ఏపీలో టీఆర్ఎస్ పోటీ చేసే బాగుంటుందని, పోటీ చేసే ఉద్దేశం ఉందా అని అడగ్గా.. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేమంటూ పేర్కొన్నారు.
 • వచ్చే ఎన్నికల్లో జూబ్లీహిల్స్ లేదా శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలంటూ కోరగా.. సిరిసిల్ల నుంచే బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు.
 • 'కేటీఆర్‌గారూ.. మీదగ్గర ఇంటర్న్‌షిప్‌ చేస్తా'నని ఓ లా విద్యార్థి కోరగా.. తన వద్ద లా విద్యార్థులు నేర్చుకునేదేం ఉందంటూనే.. ఆలోచించి చెబుతానని బదులిచ్చారు. 
 • కేసీఆర్‌, వైఎస్సార్‌లో ఎవరు బెస్ట్‌ సీఎం అని నెటిజన్లు అడగ్గా.. జవాబు మీకే తెలుసు కదా అంటూ దాటవేశారు.
 • తెలుగు రాష్ట్రాల్లో మీడియా ఎందుకు పక్షపాతంగా వ్యవహరిస్తోంది అని కేటీఆర్‌ను అడిగితే.. 'అది వాళ్లనే అడగండి' అని సూచించారు.
 • 'సార్‌ మీరు తమిళనాడుకు ముఖ్యమంత్రిగా ఎన్నికైతే చూడాలనిఉంది' అని ఓ అభిమాని చెప్పాగా.. అది అసాధ్యమని తేల్చేశారు.
 • తెలంగాణను మోడీ నిర్లక్ష్యం చేస్తున్నారా.. అని అడిగితే.. లేదని చెప్పారు కేటీఆర్‌.
 • తెలంగాణలో కేటీఆర్‌.. మరీ ఆంధ్రలో ఎవరు? అని ప్రశ్నిస్తే.. కాలేజీని వీడగానే ఖాళీలు పూరించడం ఆపేశానంటూ బదులిచ్చారు.
 • ఇవాళ్టి ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్‌లో గెలుపెవరిదని కేటీఆర్‌ను ప్రశ్నిస్తే.. 'అండర్‌ డాగ్‌' క్రోయేషియాకే ప్రపంచ వ్యాప్తంగా మద్దతిస్తున్నారని చెప్పారు.
 • ఫేవరెట్‌ ఫుట్‌ బాల్‌ ఆటగాడెవరని అడిగితే.. మెస్సీయేనని బదులిచ్చారు.
 • ధోనీ లేదా కోహ్లీలో మీకిష్టమైన క్రికెటర్‌ ఎవరు అని ఓ ఫాలోవర్‌ అడగ్గా.. తన జనరేషన్ ఆటగాళ్లు ద్రావిడ్‌, సచిన్‌ అంటే తనకిష్టమని చెప్పారు. 
 • మీ ఫెవరెట్‌ బీర్‌ ఏది? అని ప్రశ్నించగా.. 'నే చెప్పనుగా' అని జవాబిచ్చారు.
 • మీ ఫేవరెట్‌ కమెడియన్‌ ఎవరు? అని ప్రశ్నించగా.. 'రాజకీయాల్లోనా..?' అంటూ జోక్ పేల్చారు.
 • అమ్మాయిల ప్రశ్నలకు జవాబివ్వడంలేదెందుకు అని ఓ అమ్మాయి అడగ్గా.. 'నాకంత ధైర్యం ఉందా' అంటూ సరదాగా రిప్లయ్‌ ఇచ్చారు.
 • భారత యువత గురించి ఒక్కమాటలో చెప్పమని నెటిజన్లు కోరగా..  'పవర్‌ ఆఫ్‌ యూత్‌' అంటూ జవాబిచ్చారు. 
 • నగర బహిష్కరణలపై స్పందించమని అడగ్గా.. లా అండ్‌ ఆర్డర్‌ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.