కాంగ్రెస్ మహామహులను మట్టికరిపించారు

కాంగ్రెస్ మహామహులను మట్టికరిపించారు

నల్లగొండలో ఎవరు ఊహించని విధంగా ప్రజలు చైతన్యం ప్రదర్శించి, కాంగ్రెస్ మహామహులను మట్టికరిపించారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నల్లగొండలో మంగళవారం ఆయన ఎంపీ అభ్యర్ధి వేమిరెడ్డి నరసింహారెడ్డికి మద్దతుగా రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు దేశవ్యాప్తం చేయాలన్నదే సంకల్పమని తెలిపారు. టీఆర్ఎస్ 16 ఎంపీ సీట్లు గెలిస్తే రాష్ట్రానికి లాభమని స్పష్టం చేశారు. ఐదేళ్లలో దేశానికి మోడీ చేసిందేమీలేదని మండిపడ్డారు. మోడీ వేడి తగ్గిందన్నారు. ప్రజలు ఆలోచించి కాంగ్రెస్, బీజేపీని దెబ్బకొట్టాలని పిలుపునిచ్చారు. 16 మంది టీఆర్‌ఎస్ ఎంపీలు గెలిస్తే ఢిల్లీ జుట్టు మన చేతుల్లో ఉంటుంది. ఇద్దరే ఇద్దరు ఎంపీలతో తెలంగాణ తెచ్చిన మొనగాడు కేసీఆర్ అని కేటీఆర్ అన్నారు. 

'ఇక 16 ఎంపీలను ఇస్తే ఏమి చేస్తాడో ప్రజలకు తెలుసు. బీజేపీ 150 దాటదు... కాంగ్రెస్ 100 దాటదు. కేంద్రంలో ఎవరికి ఎక్కువ ఎంపీ స్థానాలు వస్తే.. వాళ్లదే హవా. ఎక్కువ సీట్లు ఉంటే.. ఎక్కువ నిధులు వస్తాయి. కాంగ్రెస్, బీజేపి ఎంపీలు ఢిల్లీలో గులాంలే. వీళ్ళు స్వతంత్రగా వ్యవహరించలేరు. కాంగ్రెస్ ఇచ్చే యాడ్స్ లో ఇక పై న్యాయం జరుగుతుందంటే... ఇప్పటి వరకు అన్యాయం చేసినట్లే కదా. ఉత్తమ్ చెప్తునట్లుగా జాతీయ పార్టీలతోనే అభివృద్ధి నిజమే అయితే.... ఎందుకు ఇంకా ఈ మోసాలు. రికార్డ్ స్థాయిలో మంత్రి పదవులు అనుభవించిన వాళ్ళు... కూడా మాట్లాడడం సిగ్గు చేటు. కాంగ్రెస్ 50 ఏండ్ల దారిద్రాన్ని ... ఐదేళ్ల లో తుడ్చడం సాధ్యమా...ఉత్తమ్, జానారెడ్డిలకు చింత సచ్చిన పులుపు చావడం లేదు. యాదాద్రి పవర్ ప్లాంట్ ను కూడా అడ్డుకునే దరిద్రులు... కాంగ్రెస్ నేతలు. మెడికల్ కాలేజీలు... ఇచ్చిన ఘనత కేసీఆర్ దే. జై కిసాన్ అనే దాన్ని కాంగ్రెస్ బీజేపీలు ఎందుకు అమలు చేయలేదు. కేసీఆర్ రైతుబందు దేశంలోనే ప్రముఖమైనది. చంద్రబాబు... అన్నదాత సుఖీభవ అంటున్నారంటే ఆ ఘనత కేసీఆర్ దే. పెన్షన్లు.. రెట్టింపు అయ్యాయి. నల్లగొండ అసెంబ్లీకి వెయ్యి కోట్లకు పైగానే నిధులు వస్తాయి. వేమిరెడ్డి నర్సింహారెడ్డిని ఆదరించండి... గెలిపించండి. కేంద్రం నిధులు రావాలంటే.... టీఆరెస్ ఎంపీలు గెలవాలి' అని కేటీఆర్ ప్రసంగించారు.