టీఆర్‌ఎస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణకు లాభం

టీఆర్‌ఎస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణకు లాభం

కాంగ్రెస్‌కు ఓటేస్తే రాహుల్ గాంధీకి లాభం. బీజేపీకి ఓటేస్తే మోడీకి లాభం. కానీ.. టీఆర్‌ఎస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణకు లాభమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదివారం శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని అల్విన్ కాలనీ సర్కిల్ లో కేటీఆర్ రోడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రాలో మోడీ కలిపారు. ఎవరికి ఎక్కువ మంది ఎంపీలు ఉంటే ఢిల్లీలో వాళ్ల మాటే చెల్లుతుంది. రైల్వే మంత్రి ఎవరైతే వాళ్ల రాష్ర్టానికే రైలు వెళ్తుంది. కొత్త రైలు మార్గాలు తెలంగాణకు రావద్దా? ఆంధ్రాకు నాలుగు ఎయిర్‌పోర్టులు వస్తే.. తెలంగాణకు ఒక్కటి కూడా రాలేదు. ఏ పనికైనా.. మట్టిపనికైనా మనోడే ఉండాలంటారు. 16 ఎంపీ సీట్లు టీఆర్‌ఎస్ గెలిస్తే కేంద్రం మెడలు వంచి నిధులు సాధించుకోవచ్చు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఢిల్లీ గులాములు. ఇద్దరు ఎంపీలతో తెలంగాణ తెచ్చిన నాయకుడు సీఎం కేసీఆర్. జాతీయ పార్టీలతోనే అభివృద్ధి సాధ్యమైతే.. దేశం ఎందుకు వెనకబడి ఉంది.  40 ఏండ్ల కింద ఇందిరా గాంధీ గరీబి హఠావో నినాదం ఇచ్చింది. 40 ఏండ్ల తర్వాత ఆమె మనవడు రాహుల్ గాంధీ గరీబీ హఠావో అంటున్నాడు. మోడీ వేషం మారింది కానీ దేశం మారలేదు. మోడీ చాయ్‌వాలా నుంచి చౌకీదార్ అయ్యాడు' కేటీఆర్ అన్నారు.