బీజేపీతో ఉంటే దేశభక్తులు..! లేకుంటే దేశ ద్రోహులు..!

బీజేపీతో ఉంటే దేశభక్తులు..! లేకుంటే దేశ ద్రోహులు..!

భారతీయ జనతా పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్... తమతో ఉంటే దేశభక్తులు...! లేకుంటే దేశద్రోహులు..! అన్నట్టుగా బీజేపీ పాలన సాగుతోందని విమర్శించారు. జాతిపిత మహాత్మాగాంధీని అవమానిస్తూ బీజేపీ ఎంపీ ప్రజ్ఞాసింగ్ చేసిన కామెంట్లను కూడా బీజేపీ సమర్థిస్తోందని మండిపడ్డారు. హైదరాబాద్‌లో తెలంగాణ వికాస సమితి మహాసభల ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ పాలన దుర్మార్గంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ కంటే గాడ్సేనే గొప్ప అంటూ ప్రజ్ఞాసింగ్ పెట్టిన ట్వీట్‌కు తాను బదులుగా బాధతో ఖండిస్తూ ఓ ట్వీట్ పెడితే.. ఆమెను సపోర్ట్ చేస్తూ పెట్టిన ట్వీట్లు తనను మరింత బాధపెట్టాయన్నారు కేటీఆర్. మతం వ్యక్తిగతమైనది.. లౌకిక రాజ్యవ్యవస్థతో దీనికి సంబంధంలేదని స్పష్టం చేసిన ఆయన.. కానీ, మతం, రాజకీయం, జాతీయవాదం విడదీయలేని విధంగా తీసుకొచ్చే పరిస్థితులు దాపురుస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతీకూల శక్తులు, అనుకూల శక్తులకు జరిగే సంఘర్షణే చరిత్ర అని ఎప్పుడూ సీఎం కేసీఆర్‌ చెబుతూ ఉంటారని గుర్తుచేసుకున్నారు కేటీఆర్.