కాంగ్రెస్, టీడీపీ కలయిక నీచమైన చర్య: కేటీఆర్

కాంగ్రెస్, టీడీపీ కలయిక నీచమైన చర్య: కేటీఆర్

ఇద్దరు గడ్డపోల్లు ఒక్కటయ్యారంటూ.. ఉత్తమ్, ఎల్. రమణ పై మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. తెలంగాణకు వ్యతిరేకులంతా ఏకమయ్యారని ఆయన ఆరోపించారు. మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్, టీడీపీ కలయిక నీచమైన చర్యగా అభివర్ణించారు. 60 ఏళ్ల రాబందులు పాలన కావాలో... రైతు బంధు పథకం పెట్టిన టీఆర్ఎస్ పాలన కావాలో తేల్చుకునే సమయం వచ్చిందని కేటీఆర్ అన్నారు. 

కాంగ్రెస్, టీడీపీ పొత్తుపెట్టుకోవటం సంతోషంగా ఉంది. ఇద్దరిని ఒకేసారి వాయించి కొట్టే అవకాశం ప్రజలకు దొరికింది. తెలంగాణ కోటి ఎకరాల మాగాణి కావాలన్నదే కేసీఆర్ లక్ష్యం. ఉత్తమ్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఎన్నికలు ఎప్పుడొచ్చిన సిద్ధమంటూ సవాల్ విసురుతున్న ప్రతిపక్షాలు...ఎన్నికల కమిషన్ కు వద్దని చెబుతున్నారు. ప్రజా కోర్టు మించింది లేదు. ప్రజల దయతోనే అసెంబ్లీలో కూర్చుంటాం. పాత నిజామాబాద్ జిల్లా మొత్తం, ఉప్పల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం. కేవలం నాలుగేళ్లలోనే కాలంతో పోటీ పడుతూ... కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసుకున్నాం. గడ్డం పెంచుకున్న ప్రతి ఒక్కరు గబ్బర్ సింగ్‌లు కారని మంత్రి కేటీఆర్ తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు.