సారు.. కారు.. పదహారు.. ఢిల్లీలో సర్కారు.. 

సారు.. కారు.. పదహారు.. ఢిల్లీలో సర్కారు.. 

లోక్‌సభ ఎన్నికల్లో సారు.. కారు.. పదహారు.. ఢిల్లీలో సర్కారు.. అనే నినాదంతో ముందుకెళ్లాలని టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశంలో కేటీఆర్ ప్రసంగిస్తూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో లోక్‌సభ ఎన్నికల్లో కూడా విజయ ఢంకా మోగించాలని అన్నారు. 16కు 16 సీట్లు గెలవాలని, మరో స్థానంలో మజ్లిస్ పార్టీ గెలవబోతోందని అన్నారు. 17 మంది ఎంపీల సహకారంతో ఎర్రకోటపై ఎవరూ జెండా ఎగురవేయాలో నిర్ణయించాల్సిన పరిస్థితి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీ జుట్టు మన చేతిలో ఉంటే తెలంగాణకు అవసమైన నిధులు, ప్రాజెక్టులు తెచ్చుకోవచ్చని తెలిపారు. అఖండమైన మెజార్టీతో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పై గులాబీ జెండా ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

ఎన్డీఏకు 150, యూపీఏకు 100కు మించి స్థానాలు వచ్చే అవకాశం లేదు. దేశంలోని పలు ప్రాంతీయ పార్టీలు.. 70 నుంచి 100 ఎంపీ స్థానాలు గెలిచే అవకాశం ఉంది. అప్పుడు సీఎం కేసీఆర్ సారథ్యంలోని ఫ్రంట్ కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది. నరేంద్ర మోడీ, రాహుల్ దేశానికి చేసిందేమీ లేదు. పోలవరానికి జాతీయ హోదా ఇచ్చారు. కానీ కాళేశ్వరానికి, పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇవ్వలేదు. 16 ఎంపీ సీట్లు గెలిస్తే ఢిల్లీ జుట్టు మన చేతిలో ఉంటుంది కాబట్టి నిధులను వరదలా తీసుకోవచ్చు. శాసనసభ ఎన్నికల్లో మిగతా పార్టీలకు బుద్ధి చెప్పినట్లే లోక్‌సభ ఎన్నికల్లోనూ బుద్ధి చెప్పాలి. కేసీఆర్ నాయకత్వాన్ని మాత్రమే తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు.

కేంద్ర క్యాబినెట్ లో ఒక్క తెలంగాణ బిడ్డకు చోటు ఇవ్వకపోవడం అవమానకరం కాదా ?. తెలంగాణకు అదనంగా ఒక్క రూపాయి మోడీ ప్రభుత్వం ఇవ్వలేదు. ఏ మొఖం పెట్టుకుని తెలంగాణలో బీజేపీ ఓట్లు అడుగుతుంది. నరేంద్రమోడీ చెప్పిన 10 కోట్ల ఉద్యోగాలు వచ్చాయా ? సబ్ కా సత్ సబకా వికాస్ అని తెలంగాణ కు హాత్ ఇచ్చారు మోడీ. ప్రతి ఒక్కరి అకౌంట్ లో 15 లక్షలు వేస్తామని మోడీ అన్నారు. ఆ 15 లక్షలు వచ్చాయా.. అని కేటీఆర్ ప్రశ్నించారు.