కర్ణాటకలో కుమారస్వామి మంత్రివర్గ విస్తరణ

కర్ణాటకలో కుమారస్వామి మంత్రివర్గ విస్తరణ

కర్ణాటకలో కాంగ్రెస్-జెడిఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి హెచ్ డి కుమారస్వామి తన మంత్రివర్గాన్ని విస్తరించారు. ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలను కేబినెట్ లోకి తీసుకున్నారు. రాజ్ భవన్ లో శుక్రవారం మధ్యాహ్నం సాదాసీదాగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ వాజుభాయ్ వాలా కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. హావేరీ జిల్లా రాణిబెణ్ణూరు ఎమ్మెల్యే ఆర్ శంకర్, కోలార్ జిల్లా ముళబాగిలు ఎమ్మెల్యే కె నాగేష్ లు కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానం సూచన మేరకు కుమారస్వామి ఈ విస్తరణ చేపట్టారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు దినేష్ గుండూరావు, జెడిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్ విశ్వనాథ్ గైర్హాజరయ్యారు. సీనియర్ నేతలు రామలింగారెడ్డి, హెచ్ కె పాటిల్ తదితరులు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు ఆర్ శంకర్ మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య నివాసం కావేరీకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. మరో స్వతంత్ర ఎమ్మెల్యే నాగేష్ ఇప్పటికే కాంగ్రెస్ సభ్యుడిగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు మంత్రి పదవులను భర్తీ చేసినప్పటికీ జెడిఎస్ కోటాలోని మరో మంత్రి పదవి ఇంకా ఖాళీగానే ఉంది. దీనిని త్వరలోనే భర్తీ చేస్తామని సీఎం కుమారస్వామి తెలిపారు.