పోలీసులకు సిగ్గులేదా ? కూన రవి సంచలన వ్యాఖ్యలు !

పోలీసులకు సిగ్గులేదా ? కూన రవి సంచలన వ్యాఖ్యలు !

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలో నందీశ్వరుడి విగ్రహం ఏర్పాటు విషయంలో టీడీపీ నేతల పై కేసులు పెట్టడాన్ని మాజీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్ తీవ్రంగా తప్పుబట్టారు. సంతబొమ్మాళి మండలంలో విగ్రహం పేరిట రాజకీయాలు చేస్తున్నారని...నందివిగ్రహం ఏర్పాటు విషయంలో తప్పుడు కేసులు పెట్టారని ఆయన మండిపడ్డారు. రోడ్డు మధ్యలో విగ్రహం పెడితే మతవిధ్వేషాలు రెచ్చగొట్టడం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. జిల్లా పోలీస్ యంత్రాంగం సీఆర్పీసీలో పనిచేస్తుందా వైఎస్సార్సీపీలో నడుస్తోందా అని ప్రశ్నించారు . పోలీసులే రౌడీయిజాన్నిప్రోత్సహిస్తున్నారని మరమ్మత్తులకు గురైన విగ్రహాన్ని రోడ్డు పై పెడితే వచ్చిన తప్పేంటని నిలదీశారు.

టెక్కలి నియోజకవర్గ ఇంచార్జి వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ ఎవరి పేరు చెబితే వారి పై కేసులు పెడుతున్నారని...నాలుగురోడ్ల జంక్షన్ లో ఏర్పాటు చేసే విగ్రహానికి ఆగమశాస్త్రం వర్తించదని కూడా తెలియదా అని ప్రశ్నించారు. తప్పుడు కేసులు పెట్టి టీడీపీ నేతలను అరెస్ట్ చేయడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించిన ఆయన నందీశ్వరుడి విగ్రహం పెడితే మత సంఘర్షణల కేసులు ఎలా పెడతారని తప్పుడు కేసుల పై కోర్టు చీవాట్లు పెట్టినా బుద్ధిరాలేదా అని పోలీసులు పై ఆగ్రహం వ్యక్తంచేశారు. వైసీపీ మోచేతి నీళ్లు తాగి తప్పుడు కేసులు పెట్టడానికి జిల్లా పోలీసులకు సిగ్గులేదా ...ఇక నైనా పోలీసులు తమ తీరు మార్చుకోవాలని సూచించారు. తప్పుడు కేసులు పెట్టి టీడీపీ నేతలను , కార్యకర్తలను ఇరికించాలని చూస్తే ...చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.